ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఒక వ్యక్తి తన ఐదేళ్ల కుమార్తెను గొంతు కోసి చంపేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా చేశాడు. బిడ్డను ఇంత దారుణంగా చంపడానికి గల కారణం విని పోలీసులు షాకయ్యారు. విభేదాలు ఉన్న పక్కింటికి వెళ్లడమే ఆ చిన్నారి చేసిన తప్పని తెలుసుకుని అందరూ నిర్ఘాంతపోయారు.
ఫిబ్రవరి 25న ఆ చిన్నారి తన ఇంటి దగ్గర నుండి అదృశ్యమైందని తమకు సమాచారం అందిందని ఒక సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. “మేము కేసు నమోదు చేశాం. చిన్నారి ఆచూకీ కనుగొనడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. గాలింపు సమయంలో, ఆమె శరీరం ఒక భాగాన్ని గుర్తించాం. మరుసటి రోజు ఇతర భాగాలు మాకు కనిపించాయి. అప్పటికి, ఆమె హత్యకు గురైందని స్పష్టమైంది” అని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ప్రవీణ్ రంజన్ సింగ్ మీడియాకు తెలిపారు.
స్థానికులను ప్రశ్నిస్తుండగా బాలిక తండ్రి అదృశ్యమయ్యాడని పోలీసులు చెప్పారు. “తండ్రి తన ఫోన్‌ను తన భార్యకు ఇచ్చి అదృశ్యమయ్యాడు. అతను అదృశ్యమైనప్పుడు, చిన్నారి కనిపించకుండాపోవడానికి ముందు జరిగిన సంఘటనల గురించి మేము కుటుంబ సభ్యులను అడిగాము. తర్వాత తండ్రి వచ్చాడు. అతనిని విచారించగా, చివరికి అతను బాలికను చంపి మృతదేహాన్ని పడేసినట్టు ఒప్పుకున్నాడు” అని అధికారి తెలిపారు.
తన కుటుంబం పొరుగున ఉన్న రాము కుటుంబం గతంలో చాలా సన్నిహితంగా ఉండేవారని, తరచుగా ఒకరినొకరు సందర్శించుకునేవారని మోహిత్ పోలీసులకు చెప్పాడు. “కొన్ని రోజుల క్రితం, రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. రెండు కుటుంబాలు మాట్లాడుకోవడం మానేశాయి. మోహిత్ తన కుమార్తెను రాము ఇంటికి వెళ్లడం మానేయమని పదేపదే చెప్పాడు, కానీ ఆమె అక్కడే వెళ్లి ఆడుకునేది.” అని నిందితుడు పోలీసులకు చెప్పాడు.
సంఘటన జరిగిన రోజు, మోహిత్ తన కూతురు రాము ఇంటి నుండి వస్తున్నట్లు చూశాడు. దీనితో అతనికి చాలా కోపం వచ్చింది. అతను ఆ చిన్నారిని తన బైక్ మీద కూర్చోబెట్టి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమె దుస్తులతో గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఆవపిండి తోటలో విసిరేసాడని పోలీసులు చెప్పారు.