విదేశాంగమంత్రి జైశంకర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. లండన్ పర్యటనలో ఉన్న జైశంకర్ పై ఖలిస్తానీ అనుకూల కార్యకర్త ఒకరు దాడికి ప్రయత్నించాడు. అయితే భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దుండగుడిని అదుపులోకి తీసుకున్నాయి.
లండన్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పై ఓ దుండుగుడు దాడికి ప్రయత్నించాడు. ఏకంగా మంత్రి జై శంకర్ కారు దగ్గరకు తీసుకొచ్చాడు.అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో ముప్పు తప్పింది. కాగా జైశంకర్ పై దాడికి ప్రయత్నించింది ఖలిస్తానీ తీవ్రవాది అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భద్రతా వైఫల్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా మంత్రి జై శంకర్ పై దాడి యత్నాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. ప్రజాస్వామ్య యుగంలో దాడి వంటి హింసాత్మక సంఘటనలకు చోటు ఉండకూడదని భారత ప్రభుత్వం పేర్కొంది. జై శంకర్ భద్రతకు సంబంధించి ఆతిథ్య దేశమైన బ్రిటన్ మరిన్ని కట్టుదిట్ట చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
జై శంకర్ పై దాడి యత్నానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లండన్ లోని చాఠమ్ హౌస్ లో జై శంకర్ అధికారిక కార్యక్రమాలు ముగించుకుని వస్తుండగా దాడి యత్నం జరిగింది. ఆ సమయంలో కొంతమంది ఖలిస్తానీ అనుకూలురు అక్కడ గుమికూడారు. భారత మంత్రి జై శంకర్ కారు ఎదురుగా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖలిస్తానీ అనుకూల జెండాలు ప్రదర్శించారు. ఆ సమయంలో ఒక దుండుగుడు మంత్రి జై శంకర్ కారు దగ్గరకు దూసుకువచ్చాడు. సదరు దుండగుడి చేతిలో భారత జెండా ఉంది. అయితే భారత జెండాను అవమానించేలా దుండుగుడు ప్రవర్తించాడు. అంతేకాదు భారత్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు కూడా చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న భద్రతా బలగాలు గమనించాయి. వెంటనే నినాదాలు చేస్తున్న దుండుగుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు దండుగుడితో పాటు ఉన్న ఇతర యువకులను అక్కడి నుంచి తరిమి కొట్టారు.
కాగా ఈనెల నాల్గవ తేదీన బ్రిటన్ పర్యటనకు వెళ్లారు విదేశాంగ మంత్రి జై శంకర్. ఈనెల తొమ్మిదో తేదీ వరకు ఆయన బ్రిటన్ లోనే ఉంటారు. ఈ సందర్బంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో జై శంకర్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారం వంటి అనేక అంశాలు , ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా భారతదేశంలో అభివృద్ది జరుగుతున్న తీరు తెన్నుల గురించి ఒక సమావేశంలో మంత్రి జై శంకర్ ప్రసంగించారు.
మనదేశంలోని సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్నదే ఖలిస్తానీ ఉద్యమ ప్రధాన లక్ష్యం. ఇందిర హయాంలో ఖలిస్థాన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. సంత్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే అప్పట్లో వేర్పాటువాదానికి కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఒక దశలో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్నాడు. అక్కడి నుంచే అనుచరులకు ఆదేశాలు జారీ చేసేవాడు. పంజాబ్‌ను అల్లకల్లోలం చేసేవాడు. దీంతో స్వర్ణ దేవాలయం నుంచి భింద్రన్‌వాలే, అతడి అనుచరులను బయటకు రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్‌కు శ్రీకారం చుట్టింది. భింద్రన్‌వాలే ను హతమార్చింది. అయితే ఖలిస్తానీ ఉద్యమకారులు ఇప్పటికీ బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కాగా ఖలిస్తానీ ఉద్యమకారులకు కొన్ని విదేశాల మద్దతు ఉందన్న ఆరోపణలున్నాయి.