కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతి రాజు శ్రీనివాస వర్మ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇవాళ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించనున్నారు.
ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత అక్కడికి వెళ్లి కార్మిక, ఉద్యోగ సంఘాలతో చర్చించబోతున్నారు. ప్యాకేజ్ ద్వారా ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్నదే కేంద్రం ఉద్దేశమని మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్లాంట్ యాజమాన్యం, కార్మికులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఉద్యమించి ప్లాంట్ సాధించుకున్నట్టే, సమష్టిగా పనిచేసి సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
2030 నాటికి దేశంలో స్టీల్ ఉత్పత్తిని 300 మిలియన్ టన్నులకు పెంచాలన్నది ప్రధాని ఆలోచనగా కేంద్ర మంత్రి చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల 3 నెలల వేతన బకాయిలు చెల్లించే అంశంపై చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అపోహలు వద్దని, భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేస్తారన్న ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.