స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చిన అవకాశాలను టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పేళవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో అతి కష్టంగా గెలిచిన భారత్.. బార్బడోస్ వేదికగా కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ఏకంగా ఓటమిని మూటగట్టుకున్నది. సెకండ్ వన్డేలో జట్టు యాజమాన్యం సీనియర్లను పక్కనపెట్టిమరీ యంగ్ గన్స్‌ను బరిలోకి దింపితే అంతగా ఫామ్‌లో లేని జట్టు చేతిలో ఓడిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 181 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని కరీబియన్ జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్ వన్డే సిరీస్‌ను 1-1తో సమంచేసింది.
శనివారం వర్షం అంతరాయం మధ్య సాగిన రెండో మ్యాచ్‌లో పేలవ ఆట తీరు కనబర్చింది. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌కు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. గత మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్న యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, ఒక సిక్సర్) మరోసారి హాఫ్‌సెంచరీతో మెరువగా.. శుభ్‌మన్ గిల్ (34) పర్వాలేదనిపించాడు. చాన్నాళ్ల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్ (9), అక్షర్ (1), పాండ్యా (7), సూర్యకుమార్ (24), జడేజా (10), శార్దూల్ (16) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్, మోతి చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
తర్వాత బ్యాటింగుకు దిగిన వెస్టిండీస్ ఆటగాళ్లు నిదానంగా ఆడుతూపాడుతూ విజయాన్ని అందుకున్నారు. షై హోప్ (63), కార్టీ (48), కైల్ మేయర్స్ (36) పరుగులతో రాణించడంతో కేవలం 36.4 ఓవర్లలోనే విండీస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే మంగళవారం (ఆగస్టు 1)న జరుగనుంది.