స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ (Congress) అంటే దొంగరాత్రి కరెంటు.. బీఆర్‌ఎస్ (BRS) అంటే 24 గంటల ఉచిత కరెంట్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్ నేతలు తిట్ల దండకం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్‌ను ఉత్త విద్యుత్‌గా మార్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth reddy) 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాల పొలం పారుతుందని చెప్పారు. రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు.
సంగారెడ్డిలో లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులను, పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ పత్రాలను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత కరెంటు ఎందుకు లేదని నిలదీశారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో రాష్ట్రంలో గ్రామాల సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు.
3 శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి 38 శాతం అవార్డులు రావడం ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని మంత్రి హరీశ్ అన్నారు. సోమవారం నుంచి రూ.99 వేల వరకు రుణమాఫీ చేయనున్నామని తెలిపారు. ఇచ్చిన మాటప్రకారం వచ్చే 15-20 రోజుల్లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేసి తీరుతామని వెల్లడించారు. బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు.