సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా యూజీసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను గవర్నర్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడం సమంజసం కాదని అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను .. బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం యూజీసీ నిబంధనల్లో చేయదలచిన మార్పులపైన కేంద్ర ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ పార్టీ ఆలోచనలను లెటర్ రూపంలో తెలియజేశామని చెప్పారు.
” ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశ పౌరులు విజయవంతంగా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం దేశంలోని యూనివర్సిటీలే. యూనివర్సిటీలో జరుగుతున్న రీసెర్చ్ పరిశోధనల ఫలితాల వల్లనే ఇది సాధ్యమైంది. దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధితో పాటు అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఐఐటి వంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నేడు యూజీసీ నిబంధనలో తేవాలనుకుంటున్న మార్పులపై మా పార్టీ డిమాండ్లను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి తెలియజేశాము.
దేశంలో రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ నియామకానికి వేసే సర్చ్ కమిటీలకు బాధ్యతను పూర్తిగా రాష్ట్ర గవర్నర్‌లకు అప్పగిస్తూ కేంద్రం తీసుకురానున్న యూజీసీ నిబంధనలపైన ధర్మేంద్ర ప్రధాన్‌కి వివరించాం. రానున్న నూతన యూజీసీ మార్గదర్శకాల్లో మార్పులపైన మా పార్టీ తరఫున విద్యా రంగ మేధావులతో సమావేశం నిర్వహించిన తర్వాత మా పార్టీ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాము.
రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను గవర్నర్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అనే ఒక నిబంధనను తీసుకురావడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం కాకుండా అభ్యర్థులు దొరకలేదని సాకుతో ఆ ఉద్యోగాలు ఇతర కేటగిరీలను భర్తీ చేసే ప్రమాదముంది. ఇది భారత రాజ్యాంగం ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన హక్కును హారించడమే. యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీలో కేవలం విద్యార్హతలపై మాత్రమే కాకుండా పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రికి చెప్పాం. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి హక్కులను హరించకుండా యూజీసీ నూతన నిబంధనలను రూపొందించాలని కోరాం”.. అని కేటీఆర్ తెలిపారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశామని… కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విజ్ఞప్తి మేరకు మా పార్టీ తరఫున…సిరిసిల్ల వరకు నిర్మాణం అవుతున్న జాతీయ రహదారి 365 బీని వేములవాడ నుంచి కోరుట్ల వరకు విస్తరించాలని కోరామన్నారు కేటీఆర్. మిడ్ మానేరు మీదుగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిను ఏర్పాటు చేసి వేములవాడ మీదుగా కోరుట్లలో జాతీయ రహదారిని 63 కలిపేలా విస్తరించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడేలా కోర్టులో కొట్లాడుతామని కేటీఆర్ తెలిపారు.