స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఖైరతాబాదులో ఘనంగా జరిగాయి. మనిషి జీవితం చాలా చిన్నదని.. మనసు నిష్కల్మషంగా ఉంచుకోవాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రామలింగేశ్వర్ రావు తెలిపారు. మనిషి సుఖవంతంగా, సంతోషంగా, సంపూర్ణంగా జీవించాలంటే చిన్న వయసు నుండే ఆధ్యాత్మికం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. స్ఫూర్తి కుటుంబం ప్రత్యేకత మానవతా సమాజం స్థాపనని, అటువంటి స్థాపనకు మనలోని చెడుని తగ్గించుకోవాలని తెలియజేశారు.
గురు శ్రీశ్రీ విశ్వస్ఫూర్తి భావాలు, ఆలోచనలు అనుసరించాలని సభాధ్యక్షులు డా.వోలేటి పార్వతీశం తెలిపారు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయని.. అయితే గురువుగారిది కులమతాలకు అతీతంగా మానవులకు సంబంధించి మానవతా స్ఫూర్తి అన్నారు. మంచిని మాత్రమే గమనించి, చెడును దూరంగా ఉంచాలని, అది కేవలం సాధన ద్వారానే సాధ్యమన్నారు. సాధన ద్వారా సాధించలేనిది ఏదీ లేదని తెలియజేశారు. గురువుగారి మానవతా సమాజ స్థాపన ఆశయంలో మనం కూడా భాగస్వాములం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
స్ఫూర్తి కుటుంబంలో కలవడం ఆనందంగా ఉందని గౌరవ అతిథి అత్తలూరి విజయలక్ష్మి తెలిపారు. గురు విశ్వస్ఫూర్తి వారు సెలవిచ్చిన ‘మానవతా రక్షతి రక్షితా’ అనే కొటేషన్ చాలా కొత్తగా ఉందన్నారు. స్ఫూర్తి కుటుంబం వసుధైక కుటుంబమన్నారు. ‘స్త్రీ సక్తి – సోషల్ స్ఫూర్తి’ విభాగం గురించి మాట్లాడిన ఆమె.. స్త్రీ శక్తి స్వరూపిణి అని, స్త్రీ సమాజంలో భాగమని, స్త్రీ పురుషులు కలిసి ముందుకు నడిస్తే సమాజం బాగుంటుందన్నారు. స్త్రీ లేకపోతే సమాజ మనుగడకు ప్రమాదమని విజయలక్ష్మి పేర్కొన్నారు.
ప్రకృతితో సహజీవనం చేస్తే మనిషి జీవితం బాగుంటుందని లేకపోతే జీవితం పతనమే అని ఆత్మీయ అతిథి ఎన్.వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. గురు విశ్వస్ఫూర్తి వారు రచించిన పుస్తకాలలోని రాజకీయ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడారు. వాటిలోని నిర్వచనాలు, ఆదేశాలు సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. రాజకీయం ఆదర్శంగా ఉండాలని, ఆఖరి వ్యక్తి వరకు సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు అందాలని పుస్తకాల సారాంశాన్ని తెలియజేశారు. మనిషికి క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ ఉండాలని పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ఉన్న ఏ వ్యవస్థ అయినా మంచిని పెంచుతుందని ఆయన తెలియజేశారు.