హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు సిద్ధమైంది. విధుల్లో ఉన్నప్పుడు హిందూయేతర మత ఆచారాలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు . 18 మందిపై క్రమశిక్షణ చర్యలకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరినప్పుడు చేసిన ప్రమాణాలను విస్మరించి హిందూయేతర పద్దతులను వారు అనుసరిస్తున్నట్టు గుర్తించింది.
హిందూయేతర ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దేవాలయ ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పాలక మండలి తెలిపింది.
వీఆర్‌ఎస్ తీసుకునే వారికి అనుమతి ఇవ్వాలని ఇటీవల టీటీడీ బోర్డు నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచనలతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నవంబరు 18న టీటీడీ బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు చర్యలు తీసున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు హిందూయేతర మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొన్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే టిటిడి నిర్వహించిన హిందూ మత ఉత్సవాలు, పండుగలు కోట్ల మంది హిందూ భక్తుల మనోభావాలపై ప్రభావం చూపిస్తాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
ఆలయ ఉద్యోగులు ఉద్యోగంలో చేరే ముందు హిందూ మతాన్ని, సంప్రదాయాలను గౌరవిస్తామని వెంకటేశ్వర విగ్రహం లేదా ఫోటో ముందు ప్రమాణం చేయాలని బోర్డు తెలిపింది.