మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. రేపటి నుంచి వేసవి సెలవులు కావడంతో తదుపరి విచారణను జూన్ 5వ తేదికి వాయిదా వేసింది. అయితే తీర్పు ఇవ్వడం అత్యవసరమని ఇరు పక్షాలు కోరాయి. దీంతో ఎమర్జెన్సీ అయితే ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు వెళ్లాలని సూచించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని.. ఈ తరుణంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. అలాగే సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని.. విధుల నిర్వహణలో తాము జోక్యం చేసుకోబోమని తెలిపింది. దీంతో అవినాశ్ తరపు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించగా.. ఆయన ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయిందని.. వాదనలు వినాలని తమపై ఒత్తిడి చేయవద్దని చెబుతూ విచారణకు నిరాకరించారు.
విచారణను జూన్ 5వ తేదికి వాయిదా వేయడం.. అత్యవసర వాదనలకు ప్రధాన న్యాయమూర్తి కూడా నిరాకరించడం.. సీబీఐ అధికారులు స్వేచ్ఛగా పని చేసుకోవొచ్చని చెప్పడంతో అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే వార్తలు జోరందుకున్నాయి.