వైట్‌హౌస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికారిక సమావేశంలో అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య గొడవ జరిగింది. మీడియా ముందే తగ్గేదేలే అంటూ ఇరు దేశాల అధినేతలు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో ఈ పరిణామం జరగడం కలకలం రేపింది.
ఖనిజాలపై ఒప్పందమే ఎజెండాగా డొనాల్డ్ ట్రంప్, జెలెన్ స్కీ వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. చర్చల అనంతరం ఓవల్ ఆఫీసుకు చేరుకున్న ఇరువురు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జెలెన్ స్కీ ఒప్పందం కుదుర్చుకో.. లేదంటే మేము బయటకు వెళ్లిపోతాం అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అతి పెద్ద సమస్యలో చిక్కుకుందన్న ట్రంప్.. దాన్ని నుంచి గట్టెక్కడం అసాధ్యమని చెప్పారు. దానికి జెలెన్‌స్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. దీంతో ఇరువురి నేతల మధ్య వాగ్వాదం మొదలైంది.
ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్‌స్కీ వ్యవహారం సరికాదని మండిపడ్డారు ట్రంప్. చాలా విషయాలను ఇది క్లిష్టతరం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఈ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని చెప్పారు. జెలెన్ స్కీ చేస్తున్న పనులతో ఆ దేశానికి చెడ్డ పేరొస్తుందని చెప్పారు. ఉక్రెయిన్‌కు 350 బిలియన్ల సాయం అందించాం.. మీరు మమ్మల్ని శాసించే పరిస్థితుల్లో లేరని ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీని స్టుపిడ్ ప్రెసిడెంట్ అంటూ మండిపడ్డారు ట్రంప్.
జెలెన్ స్కీ యుద్ధకాంక్షతో ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జీవితాలతో ఆటలాడొద్దంటూ ట్రంప్ హెచ్చరించారు.
‘మీరు చాలా ధైర్యవంతులు. కానీ మీరు మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. లేదంటే మేం తప్పుకొంటాం. అప్పుడు మీరొక్కరే పోరాడుకోవాలి. ఇంతకుమించి మీకు మార్గం లేదు. మాతో లావాదేవీకి ఇది సరైన పద్ధతి కాదు. ఏమాత్రం కృతజ్ఞత లేకుండా, అమర్యాదగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇదేం బాగోలేదు. డిమాండ్ చేసే పరిస్థితుల్లో మీరేం లేరు’ అని జెలెన్‌స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు.
ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంతో పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకున్నారు. గట్టిగా మాట్లాడవద్దని జెలెన్‌స్కీకి హితవు పలికారు వాన్స్. రెండు దేశాల మద్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని చెప్పారు. ఎలాంటి దౌత్యం అంటూ ఎదురుప్రశ్నించారు జెలెన్‌స్కీ. దీంతో వాన్స్ ఒకింత అసహనానికి గురయ్యారు.
ఉక్రెయిన్ వెంటనే శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు ట్రంప్. అప్పుడే మీ దేశంపై బుల్లెట్ల వర్షంతో పాటు మరణాలు ఆగుతాయని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తనంత స్మార్ట్ కాదన్నారు. తాము చేసిన సాయానికి కృతజ్ఞతతో ఉండాలి తప్ప.. ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు ట్రంప్.
చర్చలు రసాభాసగా మారడంతో ఖనిజ ఒప్పందాంలపై సంతకాలు చేయకుండా వైట్‌హౌస్ నుంచి బయటకు వచ్చేశారు జెలెన్‌స్కీ. ఇద్దరి అధ్యక్షుల విందు కూడా ఈ వివాదంతో రద్దైంది.
ఇరు దేశాల అధినేతల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. శాంతి స్థాపనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు సిద్ధంగా లేరని అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు తన తీరుతో ఓవల్ ఆఫీసును అగౌరవ పరిచారని మండిపడ్డారు. శాంతికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన తిరిగి రావొచ్చన్నారు ట్రంప్.
మరోవైపు అమెరికా మద్దతుకు ధన్యవాదాలు అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌తో న్యాయంతో పాటు శాశ్వతమైన శాంతి కావాలని.. అందుకోసమే తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అండగా నిలిచింది అమెరికా. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికి అవసరమైన ఆయుధాలతో పాటు నిధులను కూడా అందించింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ అధికారంలోకి రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉక్రెయిన్‌కు సాయం ఆపేసిన ట్రంప్.. జెలెన్‌స్కీ తీరు వల్లే సమస్య పెద్దదవుతుందని మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే అమెరికా పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీని మీడియా ముందే తిట్టిపోశారు.