మొక్కజొన్న చొప్ప మంటలు ఆర్పుతున్న క్రమంలో ఊపిరాడక ఓ రైతు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన భగవాన్ రెడ్డి అనే రైతు తనకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. పంట అనంతరం చొప్పను తగలబెట్టే క్రమంలో వడగాలుల ప్రభావంతో మంటలు పక్కనే ఉన్న భాస్కర్ రెడ్డి పామ్ ఆయిల్ తోటలోకి వ్యాపిం చాయి. అది గమనించిన రైతు మంటలను అదుపు చేయాలని తీవ్రంగా శ్రమించాడు. పొగ నుంచి తప్పించుకోలేక ఊపిరాడక రైతు భగవాన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై మొక్కజొన్న చేనులోనే కాలిన గాయాలతో మృతి చెందాడు. అప్పటికే పొరుగు రైతులు కాలుతూ వ్యాప్తి చెందుతున్న చొప్పను ఆర్పే ప్రయత్నం చేసి సదరు రైతును రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైతు భగవాన్ రెడ్డి మృతితో కాట్రపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.