స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar) అంతిమయాత్రలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం అంతిమయాత్రలో గద్దర్ మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (Zaheeruddin Ali Khan) ప్రాణాలు కోల్పోయారు. గద్దర్ అంత్యక్రియలు జరిగే అల్వాల్(Alwal) మహాబోధి స్కూల్ వద్ద జనం పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు అదుపు చేయలేక పోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది.
భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు స్కూల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. స్థలం సరిపోదని పోలీసులు చెప్పినా వినకుండా ముందుకు తోసుకు రావడంతో ఘటన జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జనాల మధ్యలో నీరసంగా ఉన్న జహీరుద్దీన్ అలీఖాన్ ఊపిరిరాడక పోవడంతో వెంటనే ఆయనను ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.