టాలీవుడ్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. సమంతకు మంత్రి క్షమాపణ చెప్పారు కూడా. ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దామని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా విజ్ఞప్తి చేశారు. అయితే చేసిందంతా చేసి.. అనాల్సిన నాలుగు మాటలు అనేసి ఇప్పుడు సారీ చెబితే సరిపోతుందా అని అంటున్నాయి టాలివుడ్ వర్గాలు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదంటున్నారు సినీ ప్రముఖులు,. మంత్రి కొండా సురేఖపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.
రెండు రోజుల క్రితం నాగ చైతన్య, సమంత విడాకుల గురించి అక్కినేని నాగార్జునకు ఆపాదిస్తూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని ప్రధాన నటీనటులంతా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించి మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. సినిమా ఇండస్ట్రీని సొంత రాజకీయాల కోసం వాడుకోవద్దంటూ కోరారు. ఈ విషయమై నాగార్జున కొండా సురేఖపై కోర్టు మెట్లు ఎక్కారు. పరువు నష్టం దావా కూడా వేశారు.
ఈ క్రమంలో ఈ విషయంపై రెబల్ స్టార్ ప్రభాస్ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు రాజమౌళి స్పందించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను.. అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదని రాజకీయాలు అపాదించకుండా పరువు నిలుపుకోవాలని ప్రభాస్ తన పోస్టులో వ్రాసుకొచ్చారు. మన హద్దులను గౌరవించాలి, గౌరవాన్ని కాపాడుకోండి. నిరాధార ఆరోపణలు సహించలేనివి.. ప్రత్యేకించి ప్రభుత్వంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరి కాదంటూ రాజమౌళి మాట్లాడారు.
మంత్రి కొండా సురేఖ చేస్తున్న ప్రకటనలు బాధ్యతారాహిత్యమైనవి, నిరాధారమైనవని అన్నారు రామ్ చరణ్. గౌరవనీయమైన వ్యక్తుల గురించి అసభ్యకరమైన బహిరంగ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. . ఈ రకమైన అపవాదు మన సమాజపు మూలాధారాలను నాశనం చేస్తాయని చెప్పారు. సినీ రంగమంతా కలిసికట్టుగా ఉందని.. తమని ఉద్దేశించి చేసిన ఇలాంటి నిర్లక్ష్యపు వ్యాఖ్యలను సహించమన్నారు. నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలంటూ రామ్ చరణ్ తన పోస్టులో వ్రాసుకొచ్చారు.