అటు టాలీవుడ్ లో, ఇటు రాజకీయాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారకరత్న(40) మృత్యువుతో పోరాడి పోరాడి అలసి…ఇక తీరని లోకాలకు చేరిపోయారు.
సినిమా రంగంలోకి వస్తూనే ఒకేసారి 9 సినిమాల ప్రారంభోత్సవాలతో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అయితే సినిమా కథల ఎంపికలో తీసుకున్న పొరపాట్లతో అవి ఆశించినంత విజయం సాధించకపోయినా ప్రజల మనసులో మాత్రం తారకరత్న చెరగని ముద్ర వేశాడనే చెప్పాలి.
తర్వాత కాలంలో ఆయన జనజీవన స్రవంతిలోకి రాలేదు. ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత వ్యాపార వ్యవహారాల్లో బిజీ అయిపోయారు.
ఆ తర్వాత… సడన్ గా రాజకీయాల్లో కనిపించారు. మళ్లీ ప్రజలందరూ తారకరత్న వస్తున్నాడని తెలిసి సంతోషించారు. చాలాకాలం తర్వాత చూశామని ఆనందించారు. అనంతరం రాజకీయ స్పీచ్ లతో అదరగొట్టారు. తెలుగుదేశం పార్టీకి మంచి వక్త దొరికాడని అంతా అనుకున్నారు.
మళ్లీ కొన్నాళ్లూ అజ్నాతంలోకి వెళ్లారు. తర్వాత తాజాగా రాజకీయాల్లో కొనసాగాలి అనే దృఢ సంకల్పంతో టీడీపీలో చురుకైన పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే జనవరి 27న కుప్పంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని బెంగళూరులోని నారాయణ హృదయాలకు తీసుకువెళ్లారు. 23రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన తారకరత్న ఆసుపత్రిలోనే కన్నుమూశారు.
తారకరత్న పార్థీవదేహాన్ని బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో రంగారెడ్డి జిల్లా మోకిలాలోని స్వగ్రహానికి తరలించారు. నందమూరి కుటుంబ సభ్యులు అందరూ తారకరత్న ఇంటికి చేరుతున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. చిన్నవయసులోనే తారకరత్న మరణించడం బాధాకరమని తెలిపారు. సినీ, వినోద ప్రపంచంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మా కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చి తారకరత్న వెళ్లిపోయాడని చంద్రబాబు తెలిపారు. వెంటనే భార్యతో కలిసి మోకిలాలోని తారకరత్న ఇంటికి వెళ్లారు. తారకరత్న భార్య అలేఖ్య, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంటనే తండ్రి మోహన కృష్ణకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు.
బావా అంటూ ఆత్మీయంగా పిలిచే ఆ గొంతు వినిపించదని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి తారకరత్నకు నివాళులర్పించేందుకు హైదరాబాద్ రానున్నారు.
తారకరత్న భౌతికకాయం చూసి నివాళులర్పించిన వారిలో దేవినేని ఉమ, ఆర్ నారాయణ మూర్తి, విజయసాయి రెడ్డి తదితరులు ఉన్నారు. మరికొందరు బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల నుంచి తారకరత్న అభిమానులు, నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు తరలివస్తున్నారు.
ఇక సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ రామకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నటుడు అజయ్, విజయసాయిరెడ్డి, కంభంపాటి రామమోహన రావు తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.