తెలంగాణ ప్రభుత్వం రూ.1774 కోట్ల రూపాయలతో బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. శనివారం సంగారెడ్డి జిల్లా బోరంచలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ నిర్మాణ పనులను మంత్రి హరీష్ రావు చేతులమీదుగా ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తయితే ఆందోల్, నారాయణ ఖేడ్ నియోజవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
పంప్ హౌస్ ప్రారంభ కార్యక్రమం అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక దళితులకు శుభవార్త తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై విమర్శలు గుప్పించారు. మనకంటే 60 ఏళ్ళ ముందు కాంగ్రెస్, తెలుగు దేశం వాళ్ళు పరిపాలించారు. అయినా తెలంగాణ అభివృద్ధి చెందలేదని వాపోయారు. కానీ తెలంగాణ దశ దిశ మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సింగూరు జలాలు మెదక్ హక్కు అని ఎన్నికల కోసం వాడుకున్నారు. పెద్ద పెద్ద మంత్రులు కేంద్ర మంత్రులు అయినా మన ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ వాళ్లు ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో అర్థం కాదు. గతంలో నారాయణఖేడ్ లో కాంగ్రెస్ వాళ్ళు అక్రమ గంజాయి సరఫరా చేస్తూ కోట్లు సంపాదించారు అని మంత్రి హరీష్ మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు బసవేశ్వరుడి పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు.. కానీ కేసీఆర్ మాత్రం ఆయన పేరుతో ప్రాజెక్టు కడుతున్నారన్నారు. బోరంచ గ్రామంలో దళితులందరికి దళిత బందు ఇస్తాం. బసవేశ్వర ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రి హరీష్ రావు.