నేడు ఢిల్లీలో జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడింది. రాష్ట్రాల కోర్ కమిటీ భేటీలు ఉన్నందున.. ఈ రోజు జరగాల్సిన బీజేపీ సీఈసీ భేటీ వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది.బీజేపీ సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్న నేతల్లో సమావేశం వాయిదాతో నిరాశ ఎదురైంది. అయితే ఇప్పటికే బీజేపీ తెలంగాణలో 9 మందితో తొలి జాబితాను ప్రకటిం చింది. పెండింగ్ 8 స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించిన బిజెపి అధిష్టానం.. రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మొన్న జరిగిన సమావేశంలో చర్చించిన రాష్ట్రాలు కాకుండా మిగిలిన రాష్ట్రాల పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది కేంద్ర ఎన్నికల కమిటీ. బిజెపి అదిష్టానం ప్రకటించే రెండవ జాబితాలో తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీ చేరుకున్నారు.
మరోవైపు మాజీ ఎంపీ సీతారాం నాయక్ కు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దాంతో ఆయన ఢిల్లీకి పయనం అవుతున్నారు. బీజేపీ పెద్దల సమయంలో సీతారాం నాయక్ కాషాయ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయనకు మహబూబాబాద్ టికెట్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, మహబూబ్ నగర్ టికెట్ విషయంలోనూ తీవ్ర పోటీ నెలకొంది. ఎంపీ టికెట్ కోసం డీకే అరుణ, మాజీ ఎంపీ జీతేందర్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణకు సమబంధించి 8 స్థానాలపై నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 11న బిజెపి రెండో జాబితా విడుదల కానుంది. తెలంగాణకు చెందిన 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. మార్చి 13న ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని.. ఆ తర్వాత పెండింగ్ స్థానాలకు క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే బీజేపీ తెలంగాణ 9 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను అనౌన్స్ చేసింది. సెకండ్ లిస్ట్ విడుదల సందర్భంగా ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.