స్వతంత్ర వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో ఉదయం ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు దాదాపు చివరి గంటన్నర వరకు అదే బాటలో పయనించాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న మార్కెట్లు చివరి అరగంటలో స్పష్టమైన లాభాల్లోకి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లో ముగియడం విశేషం. ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 63,328కి చేరుకుంది. నిఫ్టీ 61 పాయింట్లు పుంజుకుని 18,817కి పెరిగింది. పవర్, ఆటో, ఐటీ, టెలికాం, టెక్ తదితర సూచీలు లాభాలను ఆర్జించగా.. ఫైనాన్స్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర సూచీలు నష్టపోయాయి.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, విప్రో, నెస్లే ఇండియా, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.