మేమంతా సిద్దం బస్సుయాత్ర 20వ రోజుకు చేరుకుంది. విశాఖలో బస్ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి వైఎస్ఆర్సీపీ వర్గాలు. భోజన విరామం తరువాత గోపాలపట్నం నుంచి యాత్ర మొదలైంది. ఎన్ఏడీ జంక్షన్ మీదుగా కంచరపాలెం చేరుకుంది. అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీకి చేరుకుంటుంది. ఎండాడ వద్ద సీఎం జగన్ రాత్రి బస చేస్తారు. బస్సు యాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విశాఖ రోడ్ షో గ్రాండ్‌గా ప్లాన్ చేసింది వైసీపీ. మూడు రాజధానుల కేటగిరీలో విశాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్న అధికార పక్షం, విశాఖలో సీఎం జగన్ రోడ్ షోను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
2019లో జగన్ వేవ్‌తో 175 అసెంబ్లీ సీట్లకు 151 గెలిచినా.. విశాఖ నగరంలో విజయకేతనం ఎగురవేయలేకపోయింది వైసీపీ. విశాఖ సౌత్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ ఈస్ట్.. నాలుగు సీట్లలో గెలవలేకపోయింది వైసీపీ. ఈసారి నగరంలోని 4 అసెంబ్లీ సీట్లను క్లీన్ స్వీప్ చేసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర లోని మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో.. వైఎస్సార్‌సీపీ 28 సీట్లను సాధించింది. విశాఖ సిటీలోని 4 సీట్లు, శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఇచ్ఛాపురం సీట్లు మాత్రమే కోల్పోయింది. ఈసారి వైనాట్ 175 వ్యూహంలో భాగంగా వీటన్నింటిని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది అధికార పక్షం. అమరావతిని శాసన రాజధానిగా ఉంచి, విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించింది అధికార వైసీపీ. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమనేది వైసీపీ వాదన. ఈ నేపథ్యంలో విశాఖ రోడ్ షో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.


