స్వతంత్ర వెబ్ డెస్క్: తల్లి దండ్రులు ప్రత్యక్ష దైవాలు.. అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణంపోస్తే.. ఆ బిడ్డ భవిష్యత్తు భారాన్ని భుజాలకెత్తుకునేది నాన్న.. చిన్ని పాదాలతో తన గుండెలపై తంతే పొంగిపోతాడు. ముద్దుముద్దుగా మాట్లాడితే మురిసిపోతాడు. కేరింతలు కొడుతూ తప్పటడుగులు వేస్తుంటే.. తానే ప్రపంచాన్ని జయించానని అనుకుంటాడు. నీ సంతోషం చూసి తానూ చిన్నపిల్లాడైపోతాడు. అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ.. నీకై పరితపించే వ్యక్తి నాన్న.
అనునిత్యం నిన్ను కళ్లల్లో పెట్టుకుని.. కాపుకాసే వ్యక్తి నాన్న. కుటుంబానికి యజమానిగా, ఇంటికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ తండ్రి అన్ని బరువు బాధ్యతలను తన భుజాన మోస్తాడు, కుటుంబానికి రక్షణ కల్పిస్తూ ఒక ధైర్యంగా నిలుస్తాడు, పిల్లల ఎదుగుదలను పెంపొందించడంతోపాటు అవసరమైనప్పుడల్లా వారికి భావోద్వేగ మద్దతును, మార్గదర్శకత్వాన్ని అందిస్తాడు. కుటుంబ బలానికి మూలస్తంభంగా నిలుస్తాడు. తమ ప్రియమైనవారి కోసం అచంచలమైన నిబద్ధతను కలిగి ఉంటాడు. అందుకే తండ్రి పాత్ర ఎంతో కఠినమైనది, చాలా గొప్పది. సవాళ్లను అధిగమిస్తూ.. అనుక్షణం బిడ్డల ఎదుగుదలే.. తన విజయంగా భావించి మురిసిపోతుంటాడు.. నాన్నంటే ధైర్యం.. నాన్నంటే సంతోషం.. నాన్నంటే ఓ నమ్మకం. నాన్నంటే సమాజంలో మనల్ని ముందుకు నడిపించే నేస్తం. ఆయనే మన సమస్తం.. బిడ్డల భవిష్యత్తుకోసం పరితపించే నాన్నలకు ఇవాళ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
తండ్రిని గౌరవించడం కోసం ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారంను పితృ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 18న జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకొని మీ నాన్నకు ప్రేమతో ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేయండి.