తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో హీరోయిన్ సంయుక్తా మీనన్, యువ కథానాయకుడు ఆకాశ్ పూరీ, సినీగాయని మంగ్లీ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయక మంటపంలో వేద పండుతులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు ఇచ్చారు.
శ్రీవారిని దర్శించుకుంటే తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నారు సంయుక్తా మీనన్. ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తే తనకు మంచి జరుగుతుందన్నారు తాను నటించిన నాలుగైదు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నట్టు చెప్పారు. ఈ ఏడాది తనకు చాలా కీలకం అని, స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు సంయుక్తా మీనన్ తెలిపారు.
స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆకాశ్ పూరి. తల్వార్ సినిమాతో ప్రేక్షకుల ముందు తాను వస్తున్నట్లు తెలిపారు. ఈ నెల ఆఖరులో సినిమా ప్రారంభం కానుందని, ప్రారంభానికి ముందు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చానన్నారు. నాన్న పూరి జగన్నాథ్ కొత్త సినిమా కథ రాస్తున్నారని, ఆ సినిమాకి ఇంకా హీరో ఫిక్స్ కాలేదన్నారు. నాన్నతో సినిమా చేయడానికి చాలా సమయం ఉందని ఆకాశ్ తెలిపారు.
ఒక్కసారిగా తిరుమలలో సినీ తారలు తళుక్కుమనడంతో భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. సెల్ఫీలు తీసుకుని, కరచాలనం చేస్తూ తమ అభిమాన నటులకు తమ అభిమానాన్ని ప్రకటించుకున్నారు.