లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. పోటీ చేసే నేతల విషయంలో సమీకరణాలు అత్యంత క్లిష్టంగా మారుతున్నాయి. స్విచ్ ఒక దగ్గర వేస్తే బల్బ్ మరో చోట వెలిగిన మాదిరిగా ఈక్వేషన్స్ మారుతున్నాయి. ముఖ్యంగా మల్లు రవి ఎఫెక్ట్ మరొకరి సీట్‌కు ఎసరు పెడుతోంది. ఇంతకీ మల్లు రవి ఎఫెక్ట్ ఏంటి..? టి.కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలేంటి..?
టీకాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఒకరి సీటు ఇవ్వాల్సి వస్తే మరొకరికి ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఎఫెక్ట్ ఇన్ డైరెక్ట్‌గా మరొకరిపై పడుతోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టి.కాంగ్రెస్ ఈ సారి అత్యంత జాగ్రత్తగా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయాలని చూస్తోంది. ముఖ్యంగా రిజర్వుడు స్థానాల విషయంలో ఏ మాత్రం పొరపాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఎస్సీ రిజర్వుడు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది.
తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. వీటిలో సామాజిక సమీకరణాలను బేస్ చేసుకొని రెండు స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి, ఒకటి మాల సామాజికవర్గానికి ఇవ్వాలని భావించారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి స్థానాలు ఉన్నాయి. ఇందులో పెద్దపల్లి స్థానాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకి ఇవ్వాలని భావించారు. గడ్డం వంశీ మాల సామాజిక వర్గం కావడంతో మిగతా రెండు స్థానాలు వరంగల్, నాగర్ కర్నూల్‌లను మాదిగ సామాజిక వర్గాలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అందులో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న మల్లు రవికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్ కట్టబెట్టారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఎట్టి పరిస్థితిలో నాగర్ కర్నూల్ బరిలో నిలుస్తానని మల్లు రవి తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్‌కు రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. దీంతో పరిస్థితి రివర్స్ అవుతోంది. నాగర్ కర్నూల్ సీటు విషయంలో మల్లు రవి గట్టి పట్టు పడుతుండటంతో.. పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే మల్లు రవికి నాగర్ కర్నూల్ సీటు ఇచ్చే పరిస్థితి ఉంటే.. మిగతా రెండు సీట్లపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా పెద్దపల్లి సీటును గడ్డం వంశీకి చేజారే అవకాశం ఉంది. దీంతో మాల సామాజిక వర్గమైన గడ్డం వంశీకి కాకుండా మాదిగ సామాజిక వర్గమైన వ్యక్తికి ఇచ్చే అవకావాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీలో చేరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. వీరే కాకుండా పార్టీకి చెందిన మాదిగ సామాజిక వర్గనేతలు పెర్క శ్యామ్, రామిళ్ల రాధికలు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
మాదిగ సామాజికవర్గ నేతల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో పొలిటికల్‌గా తీవ్ర ఒత్తిడి పార్టీపై పెరుగుతోంది. మరోవైపు గడ్డం ఫ్యామిలో ఇప్పటికే చెన్నూరు నుంచి వివేక్, ఆయన సోదరుడు వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మరోవైపు గడ్డం వివేక్ కుమారుడు వంశీకి టికెట్ ఇచ్చే విషయంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి తోడు మల్లు రవి ఎఫెక్ట్‌తో పెద్దపల్లి నుంచి గడ్డం ఫ్యామిలీ అవుట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.


