తెలంగాణలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు ఇప్పుడు జనం దగ్గరకు వెళ్లటానికి కొత్త అస్త్రం దొరికింది. అదే…కరవు. తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితిని లోక్సభ ఎన్నికల్లో తమకు అనుకూ లంగా ఉపయోగించు కోవడానికి అధికారపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షాలైన భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి వ్యూహాలు పన్నుతున్నాయి.
తెలంగాణలో నెలకొన్న కరవుకు సంబంధించి గులాబీ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ఓ సంచలనాత్మక ప్రకటన చేశారు. తెలంగాణ కరువు….ప్రకృతిపరంగా రాలేద న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తూ వస్తూ కరువును తీసుకొచ్చిందన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు కేసీఆర్. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా యన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని గులాబీ పార్టీ అధినేత డిమాండ్ చేశారు.
గత పదేళ్లలో వ్యవసాయ స్థిరీకరణ కోసం స్పష్టమైన విధానాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు కెళ్లిందన్నారు కేసీఆర్. సాగునీరు, ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా, పంట కొనుగోళ్లు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేశామని గుర్తు చేశారాయన. గులాబీ పార్టీ అధికారంలోకి రాక ముందు దాదాపు 40 టన్నుల ధాన్యం పండించే స్థాయి ఉండేదన్నారు. అయితే తమ ప్రభుత్వం దీనిని మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తీసుకెళ్లిందన్నారు. అయితే కేవలం వంద రోజుల వ్యవధిలో పంటల పరిస్థితి పూర్తిగా తారుమారైందని వ్యాఖ్యానించారు.రైతుల కష్టాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీ యాత్రలోనే కాలం వెళ్లదీస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.
కేసీఆర్ చేసిన ఈ కరువు కామెంట్ తెలంగాణ రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. అంతేకాదు ఈ వ్యాఖ్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్పై ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణను తప్పుపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా 200 మంది రైతులు చనిపోతే…ఆ వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. చనిపోయిన 200 మంది రైతులే అయితే వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమదేనని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
వేలాది పుస్తకాలు చదివిన కేసీఆర్కు వానలు ఎప్పుడు పడతాయో తెలియదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ చలికాలంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈ సంద ర్భంగా ఆయన గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు చలికాలంలో వానలు పడతాయా అని కేసీఆర్ను ప్రశ్నించారు. వర్షాకాలంలో సమృద్ధిగా వానలు పడకపోవడం వల్లనే కరువు వచ్చిందన్నారు. కేసీఆర్ పనులకు వరుణదేవుడు భయపడి పారిపోయాడన్నారు. అందుకే వానలు పడలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో కరువుకు సృష్టికర్త కేసీఆరేఅన్నారు. అయితే ఆ విషయం మరిచిపోయి కరువు అంశాన్ని కాంగ్రెస్ ఖాతాలో కేసీఆర్ వేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
ఇదిలాఉంటే కరవు అంశంపై ఇటు కాంగ్రెస్ అటు గులాబీ పార్టీని విమర్శించి లబ్ది పొందాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.ఇందుకు సంబంధించి బీజేపీ ఓ గేమ్ప్లాన్ తయారు చేసింది. కరువు పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలదేనని ఘాటు ఆరోపణలు చేసింది కమలం పార్టీ. కరవు నుంచి రైతులను ఆదుకోవడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా కరవును ప్రస్తావిస్తూ , బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా రైతు సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నారు. ఏ కారణంగా కరవు వచ్చినా, నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ , తాజాగా పాంచ్ న్యాయ్ పేరుతో కొత్త అవతారమెత్తిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ, వరికి బోనస్, పంటల కార్పొరేషన్ …ఇలాంటి వాగ్దానాలను కాంగ్రెస్ ఇప్పటికైనా అమలు చేయాలని కమలనా థులు డిమాండ్ చేశారు.
పనిలోపనిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆరోపణలు చేశారు బీజేపీ నాయకులు. పదేళ్ల కాలంలో అన్నదాతలను నట్టేట ముంచిన కేసీఆర్ ఇప్పుడు ఎండిన పొలాలను సందర్శించడం విడ్డూరమని కమలనాథులు ఎద్దేవా చేశారు. గతంలో 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏరోజూ అన్నదాతలకు సాయం అందించని కేసీఆర్, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారని నిప్పులు చెరిగారు. కాగా లోక్సభ ఎన్నికల నాటికి కరవు పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశా లున్నా యి. దీంతో చివరకు కరవు పరిస్థితి ఏ టర్న్ తీసుకుంటుందోననే గుబులు మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో మొదలైంది.


