నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డీఐజీ, ఐజీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలు కాసేపట్లో ప్రమాద స్థలికి చేరుకోనున్నాయి. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని తెలియజేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మట్లాడుతూ.. ఉదయం 8గంటలకు కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లారని… 8.30గంటలకు బోరింగ్ మిషన్ ఆన్ చేశారని చెప్పారు. టన్నెల్‌లో ఒకవైపు నుంచి నీరు లీకై మట్టి కుంగి పెద్ద శబ్దం వచ్చిందని… టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టారని చెప్పారు. వెంటనే అప్రమత్తమై 42 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చారని వివరించారు. బోరింగ్ మిషన్ ముందున్న 8మంది చిక్కుకుపోయారని… వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
8మంది ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని మంత్రి తెలిపరు. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘటన జరిగితే టన్నెల్‌లో వారిని రెస్క్యూ చేసిన ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడామని చెప్పారు. టన్నెల్‌లో చిక్కుపోయిన వారు ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్ వాసులుగా గుర్తించామన్నారు. వారిలో ఒక ప్రాజెక్టు ఇంజినీరు, ఫీల్డ్ ఇంజినీరు, నలుగురు కార్మికులు, జమ్మూకశ్మీర్, పంజాబ్‌కు చెందిన ఇద్దరు బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారని వివరించారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారికి వెంటిలేషన్ ఇబ్బంది లేదన్నారుయ మంత్రి. 14 కిలోమీటర్ల లోపల ఇరుక్కు పోవడంతో వారిని బయటకు తీసుకురావడం సవాల్‌గా మారిందిని చెప్పారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. రెస్క్యూ బృందాలు ఈ రాత్రికి ఘటనా స్థలికి చేరుకుంటాయని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.