జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రెండో రోజు కూడా రసాభాసగా మారింది. మేయర్ చాంబర్ ముందు బిఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. తమను కౌన్సిల్ సమావేశం నుంచి అన్యాయంగా బయటకు పంపించారని బిఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. జిహెచ్ఎంసి బడ్జెట్‌పై ఎలాంటి చర్చ జరగకుండానే ఆమోదం తెలిపారంటూ నిరసన వ్యక్తం చేశారు. మహిళా కార్పోరేటర్లను ఈడ్చుకుంటూ వెళ్ళడం అమానుష చర్య అంటూ ఆరోపించారు. మేయర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బిఆర్ఎస్ కార్పోరేటర్లు మౌనం పోరాటం చేశారు. నిన్న కౌన్సిల్ సమావేశంలో తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని అన్నారు. మౌన పోరాటానికి కూర్చున్న కార్పోరేటర్లను అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు దగ్గరకు పంపించారు సెక్యూరిటీ సిబ్బంది . అడిషనల్ కమిషనర్ శివ కుమార్ నాయుడుకి వినతిపత్రం ఇచ్చారు కార్పోరేటర్లు.
మేయర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన ఆరోపణలు, కౌన్సిల్ మీటింగ్ లో జరిగిన అంశాల పై చర్చించారు. మధ్యాహ్నం తర్వాత జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ కార్పోరేటర్లు.. కౌన్సిల్ సమావేశంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లే గొడవ చేశారని అంటున్నారు. తాము కౌన్సిల్ సమావేశాన్ని శాంతియుతంగా నిర్వహించామని అంటున్నారు.
“బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ లో మా పై చిటికెలు చేసి, ధంకీ ఇచ్చారు. సభను, మేయర్‌ను లెక్కచేయకుండా రౌడీల్లాగా ప్రవర్తించారు. వాళ్ళ అధిష్ఠానం మెప్పు కోసం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ కార్పొరేటర్లు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి ఆరోపణలు అవాస్తవం”.. అని కాంగ్రెస్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు.
“బీఆర్ఎస్ మహిళ కార్పొరేటర్లు దుర్భాషలడుతూ నాపై దాడి చేశారు. వాళ్ళు చేసిన దాడిలో నాకు గాయాలయ్యాయి. ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను. నిన్న నాపై జరిగిన దాడిపై పోలీసులు విచారణ చేయాలి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాళ్ళ గోర్లలో విషం పెట్టుకుని వచ్చి నాపై దాడి చేసినట్లు అనుమానం వస్తుంది. వేరే పార్టీలో ఉన్న విగ్గు తలసాని, గంట కొట్టే మాగంటి, మల్లా రెడ్డి లను తీసుకొచ్చి పదవులు కట్టబెట్టారు. బీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులు నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి పరామర్శించారు”.. కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు.