30.2 C
Hyderabad
Saturday, May 25, 2024
spot_img

మెదక్ లోక్ సభ స్థానం గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లవే!

   తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎంలలో భద్రంగా దాగుంది. అయితే భారీ స్థాయిలో కొన్ని చోట్ల నమోదైన పోలింగ్ విషయంలో రాజకీయ పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ నెలకొన్న పార్లమెంటు స్థానం మెదక్. మరి.. ఇక్కడ గెలుపు విషయంలో పార్టీల లెక్కలు ఎలా ఉన్నాయి ?

మెదక్ ఎంపీ స్థానం బీఆర్ఎస్‌కు కంచుకోట లాంటిది. పైగా సిట్టింగ్ ఎంపీ సీటు కూడా. ఇలాంటి చోట గెలుపు అన్ని పార్టీలకూ, ప్రత్యేకించి బీఆర్ఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైనదేనని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మెదక్ ఎంపీ స్థానంలో మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 75 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడంతో.. అన్ని పార్టీలు వారి వారి అంచనాల్లో మునిగిపోయి ఉన్నాయి. పైగా 2019 ఎన్నికలతో పోలిస్తే.. నాలుగు శాతం ఎక్కువ పోలింగ్ రికార్డు కావడంతో గెలుపు ఎవరిదన్న లెక్కలు వేస్తున్నాయి అన్ని పార్టీలు.

నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎంపీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మక మైనవి. ఇంకా చెప్పాలంటే కేసీఆర్, హరీష్‌రావుకు ఈ స్థానంలో పార్టీ గెలుపు సాధించడం అత్యంత ముఖ్యం. 2004 నుంచి 2019 వరకు ఇక్కడ ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో కేసీఆర్ ఎంపీగా విజయం సాధించినప్పటికీ.. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం అయ్యారు. దీంతో.. ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారాయన. ఫలితంగా నాడు జరిగిన ఉపఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించి బీఆర్ఎస్ సత్తా చాటారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇటీవలే జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ హైదరాబాద్ మినహా జిల్లాల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుగాలి వీచినా, మెదక్ లోక్‌సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆరింటిని గులాబీ పార్టీ సొంతం చేసుకొని జిల్లాపై పట్టు నిరూపించుకుంది.

మాజీ మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట కూడా ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఉండడంతో గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాయి. ఒకానొక దశలో మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తారని ప్రచారం సాగినా చివరకు మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని బరిలో నిలిపారు. ఇటు కేసీఆర్, అటు హరీష్‌ సహా ఇతర నేతలు ప్రచార పర్వంలో దిగారు. మెదక్, సిద్ధిపేట, నర్సాపూర్, పటాన్ చెరు, సంగారెడ్డి అసెంబ్లీ పరిధిలో భారీ సభలు, రోడ్‌షోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. ఇక, అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హస్తం పార్టీ తరఫున నీలం మధు పోటీ చేయగా కమలం తరఫున రఘునందన్ రావు బరిలో దిగారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించగా బీజేపీ తరఫున స్వయంగా మోడీ, అమిత్ షాలు రంగంలోకి దిగారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం తమవంతుగా చేశారు.

ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా బీఆర్ఎస్ ఈ స్థానంలో బలంగా ఉండడంతో ఇప్పుడు అన్ని పార్టీలూ ఓటింగ్‌పై పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నాయి. బూత్‌ల వారీగా పోలింగ్ వివరాలను, ఆయా అసెంబ్లీ స్థానాల పరిధిలో పరిణామాలను, అనుకూలతలు, ప్రతికూలతల ఆధారంగా ఓటర్లు ఎటువైపు నిలిచారు. ఎవరికి హ్యాండిచ్చారు అనే అంచనాకు వస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా అన్ని పార్టీలూ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాకలో బీఆర్ఎస్‌ మెజార్టీ సాధిస్తుందని భావిస్తున్నారు. పటాన్ చెరు, నర్సాపూర్‌లో స్పల్ప మెజార్టీ ఉంటుందని లెక్కలేస్తోంది గులాబీ పార్టీ. అదే సమయంలో సంగారెడ్డి, మెదక్, పటాన్ చెరు, నర్సాపూర్, గజ్వేల్‌పై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. దుబ్బాక, గజ్వేల్, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, పటాన్ చెరులో తమకు పరిస్థితి సానుకూలంగా ఉందని కమలం చెబుతోంది. ఇలా ఎవరి అంచనాలు, ఎవరి లెక్కలు ఎలా ఉన్నా, అంతిమ నిర్ణేత మాత్రం ఓటరే. మరి ఆ ఓటరన్న ఎవరికి ఓటేశారు ? ఎవర్ని గెలిపించబోతున్నారన్నది జూన్ నాలుగున తేలనుంది.

Latest Articles

‘యక్షిణి’లో జ్వాలగా నేను తప్ప ఎవరూ చేయలేరనిపించింది: మంచు లక్ష్మి

ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ "యక్షిణి". ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్