స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ ఘోరంగా చతికిలపడింది. గతంలో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు కోల్పోయింది. బీజేపీ పరాభవానికి అనేక కారణాలను విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అందులో ముఖ్యంగా కేవలం కొన్ని సామాజిక వర్గాలపైనే ఆ పార్టీ అధారపడడం అని చెబుతున్నారు. అలాగే పార్టీ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడం.. రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తేవడం వంటి పలు కారణాలు బీజేపీపై బలంగా ప్రభావం చూపాయంటున్నారు. ఎన్నికలకు కొంత కాలం ముందు నుంచే బసవరాజు బొమ్మై ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడినా దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమవ్వడం ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు.
దశాబ్దాలుగా బీజేపీకి అండగా ఉంటున్న లింగాయత్ ఓట్లలో చీలిక రావడం పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. 2021లో యడియూరప్పను బలవంతంగా సీఎం పదవి నుంచి దించేయడం ఆ వర్గం ఓటర్లకు నచ్చలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మరో లింగాయత్ నాయకుడు బసవరాజ్ బొమ్మై ఎంపికైనా ఆ సామాజికవర్గంలో ఆయనకు అంత పట్టులేకపోవడం.. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, సీనియర్ నేత లక్ష్మణ్ సావడి వంటి నేతలకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ వర్గంలో చీలిక వచ్చింది. దీంతో వర్గం ఓట్లు కొంత కాంగ్రెస్ వైపు మళ్లాయి.
ఇక ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడంతో పాటు ముస్లింల ఓట్లు తమకు అవసరం లేదని యడియూరప్ప, మాజీ మంత్రి ఈశ్వరప్పలు తెగేసి చెప్పడంతో మైనార్టీల ఓటర్లు పూర్తిగా దూరమయ్యారు. వీటితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై 40శాతం కమిషన్ అంటూ అవినీతి ఆరోపణలు రావడం కూడా ఆ పార్టీ విజయావకాశాలపై ప్రభావితం చూపింది. ఎన్నికలకు ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప ఇంట్లో భారీగా నగదు దొరకడం.. ఆయన అరెస్టు అవ్వడం కూడా పార్టీని బాగా దెబ్బతీసింది.