దుందుడుకు మనస్తత్వానికి మారుపేరుగా నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి బరిలో నిలిచారు. అమెరికాకు పూర్వ వైభవం రావాలంటే తన నాయకత్వమే శరణ్యమంటారు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల ఫలితంగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఉనికి ప్రశ్నార్థకం గా మారిందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారాయన. ఒకసారి కాదు. అవకాశం దొరికినప్పుడల్లా జో బైడెన్‌ను ఎద్దేవా చేస్తూ డొనాల్డ్ ట్రంప్ కామెంట్లు చేస్తుంటారు. ఆఫ్గన్ పరిణామాలు, ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడిని నిలువరించడంలో వైఫల్యం ఇవన్నీ అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ఉనికిని నామమాత్రం చేశాయన్నది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రధాన ఆరోపణ.
అంతేకాదు తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడి చేసి ఉండేది కాదని ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు నచ్చేచెప్పే సత్తా తనకు ఉందంటారు డొనాల్డ్ ట్రంప్. ఏమైనా ఉక్రెయిన్‌పై సైనికదాడిని నిలువరించడంలో జో బైడెన్ ప్రభుత్వం విఫలమైందన్నది ట్రంప్ మహాశయుడి వ్యాఖ్యల సారాంశం. ఇదిలా ఉంటే, అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ అంతటి వివాదాస్పద నాయకుడు మరొకరు లేరంటారు రాజకీయ విశ్లేషకులు. 2021 జనవరి ఆరో తేదీన పార్లమెంటు భవనంపై జరిగిన దాడి సంఘటన, డొనాల్ట్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది. ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ విచారణ కమిటీ సిఫార్సు చేసింది. పార్లమెంటు భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టారని విచారణ కమిటీ తేల్చి చెప్పింది. అమెరికా చరిత్రలో ఇదొక అనూహ్య పరిణామం.ఇదొక్కటే కాదు అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంపే. ఇంతటి ఘన చరిత్ర ను ట్రంప్ మూటగట్టుకున్నారు. అంతేకాదు తన ఆస్తుల లెక్కలను తప్పుగా చూపించినందుకు న్యాయ స్థానం ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై ట్రంప్ అప్పీల్ కెళ్లారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇది చిన్నా చితకా వివాదం కాదు. అమెరికా సమాజంలో దుమారం రేపిన వివాదం. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడు కాకపోతే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రక్తపాతం జరుగుతుం దంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్య అమెరికాలో దుమారం రేపింది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యపై అమెరికా రాజకీయ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ వర్గాలు రానున్న ప్రమాదాన్ని శంకించాయి. వెంట నే వెనక్కి తగ్గాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాలను విమర్శిస్తూ మాత్రమే ట్రంప్ వ్యాఖ్యా నించా రని రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యల నుంచి డొనాల్డ్ ట్రంప్‌ను రక్షించడానికి తమకు చేతనైన సాయం చేయడానికి ప్రయత్నించారు.
మేక్ అమెరికా గ్రేట్ అగైన్ 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఉపయోగించిన మంత్రం ఇదే. ఈ మంత్రం జనంలోకి దూసుకెళ్లింది. అలాగే నేటివిటీని టార్గెట్ గా చేసుకుని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రచారం కూడా ఫలితాన్నిచ్చింది. కొన్ని తరాలుగా అమెరికాలో పుట్టి పెరిగిన నేటివ్ అమెరికన్లు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే,ఆసియా దేశాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వారు కార్పొరేట్ రంగాల దిగ్గజాలుగా మారుతున్నారంటూ ట్రంప్ చేసిన విద్వేషపూరిత ప్రచారం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. భూమిపుత్రులైన అమెరికన్లను బాగా రెచ్చగొట్టింది. దీంతో భూమిపుత్రులు డొనాల్ట్ ట్రంప్ కు జై కొట్టారు. ఈసారి కూడా అదే మంత్రాన్ని ఉపయోగించడానికి డొనాల్డ్ ట్రంప్ రెడీ అవుతు న్నారు.వాస్తవానికి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ఇద్దరూ అమెరికా ప్రజలకు కొత్తది కాదు. అంతేకాదు ప్రపంచ ప్రజలకు కూడా కొత్త కాదు. వీరిద్దరి పాలనను అమెరికన్లతో పాటు యావత్ ప్రపంచం గమనించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు భవిష్యత్తులో అమెరికా ఎదుర్కొనే సమస్యలకు ఎలా పరిష్కారం కనుక్కుంటారన్న చర్చోపచర్చలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే అమెరికాలో అధ్యక్షులుగా వయస్సు మీద పడ్డవారు ఎన్నిక కావడం పై కూడా కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఇక్కడ జో బైడెన్ వయస్సు కాగా 81 సంవత్సరాలు కాగా డొనాల్డ్ ట్రంప్ వయస్సు 78 ఏళ్లు. ఏమైనా బైడెన్, ట్రంప్ ఇద్దరిలో ఎవరు అధ్య క్షుడిగా ఎన్నికైనా, దాదాపు ఎనభై ఏళ్ల వృద్దుడు అగ్రరాజ్యమైన అమెరికాకు నాయకత్వం వహించి నట్లే అవుతుంది.