గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా డీఆర్‌ఐ అధికారులు సంచలన విషయాలను కోర్టు ముందు ఉంచారు. రన్యారావు శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని తెలిపారు.
రన్యారావును శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆమె కోర్టులో ప్రవేశపెట్టగానే న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టినట్టు తెలుస్తోంది. వీఐపీ ప్రోటోకాల్స్‌ను దుర్వినియోగం చేస్తూ ఓ సిండికేట్ ముఠా గోల్డ్ స్మగ్లింగ్‌లో భాగమైనట్లు గుర్తించామని డీఆర్‌ఐ అధికారులు కోర్టుకు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని చెప్పారు. అయితే దుబాయ్‌కి వెళ్లడానికి చాలా రోజుల ముందే తనకు ఈ గాయాలు అయ్యాయని రన్యారావు డీఆర్ఐకి చెప్పారట. దీంతో ఆమెకు అవసరమైన వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
మరోవైపు నిందితురాలు దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడం లేదని డీఆర్‌ఐ తెలియజేసింది. ఇదిలాఉండగా..ఈ కేసుకు సంబంధించి మూడు రోజులపాటు విచారించేందుకు డీఆర్‌ఐకు అనుమతిస్తూ సంబంధిత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.
ఇతర దేశాల నుంచి బంగారం రవాణా చేస్తూ రన్యారావు డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఆమె ఇంటి నుంచి అధికారులు ఇప్పటికే 14.2 కిలోల బంగారు బిస్కెట్లు, సుమారు రూ.2.06 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు జప్తు చేసుకున్నారు. గత ఆరు నెలల్లో 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చినట్టు, దాంతోపాటు సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలకూ ఆమె ప్రయాణించినట్లు డీఆర్‌ఐ అధికారులకు విచారణలో రన్యారావు తెలిపింది. మరోవైపు సంఘవిద్రోహ శక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో గుర్తించారు. ప్రస్తుతం ఆ దిశగానూ విచారణ జరుగుతోంతది. కాగా బెయిలు కోసం ప్రత్యేక న్యాయస్థానంలో రన్యారావు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.