ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ చుట్టూ వివాదం అలముకున్న వేళ భారత్-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా స్పందించింది. తమ మధ్య సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఇరు దేశాలు ఈ సమస్యను అధిగమిస్తాయని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎప్పట్లానే బలంగా ఉన్నాయని వివరించారు. అదానీ గ్రూప్‌పై ఆరోపణల విషయం తమ దృష్టికి వచ్చిందని..వీటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మాత్రమే సరైన సమాచారం ఇవ్వగలవని తెలిపారు.
మరోవైపు అదానీ గ్రూప్‌నకు కెన్యా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లంచం ఆరోపణలపై అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ సహా, విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు కెన్యా ప్రభుత్వం 736 మిలియన్ డాలర్లకు అదానీ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా అదానీపై కేసు నమోదవడంతో కెన్యా ప్రభుత్వం కాంట్రాక్టులను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.