గంజాయి సరఫరా, రవాణాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీంతో గంజాయి విక్రయాలకు అక్రమార్కులు కొత్త దారులు వెతుకుతున్నారు. గంజాయి సరఫరాలో కొత్త పుంతలు తొక్కుతున్న సంఘటనలు రోజుకొకటి ఎక్సైజ్ దాడుల్లో బయట పడుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్ లోని ఒక ఐస్ క్రీమ్ దుకాణంలో మద్యాన్ని వినియోగించి చాక్‌లేట్ తయారు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడవక ముందే .. పసుపు విక్రయాల మాటున గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ దాడుల్లో ధూల్‌పేటకు చెందిన నేహాభాయ్ అనే మహిళ పట్టుబడింది. పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్మకాలు కొనసాగిస్తోంది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ తిరుపతి యాదవ్, ఎస్సై నాగరాజ్ తో పాటు సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. పసుపు ప్యాకెట్‌లో ఉన్న 10 గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దాడులు నిర్వహించిన ఎన్ఫోర్స్‌మెంట్ టీమ్‌ను డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు.