స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ అప్పులు..ఇప్పుడు వైసీపీ, ప్రతిపక్షాల మధ్య జరిగుతున్న చర్చ. తాము గత టిడిపి ప్రభుత్వం కంటే తక్కువే అప్పులు చేశామని, చేసినవన్నీ ప్రజలకు పథకాల రూపంలో పంచిపెట్టామని, మరి టిడిపి అప్పులు తీసుకుని ఏం చేసిందని వైసీపీ ప్రశ్నిస్తుంది. రాష్ట్రం విడిపోయే సరికి లక్ష కోట్ల వరకు అప్పు ఉంటే.. టిడిపి హయాంలో రెండు లక్షల కోట్లపైనే అప్పులు పెట్టారని, తమ హయాంలో రెండు లక్షల కోట్ల లోపే అప్పులు చేశామని వైసీపీ అంటుంది. కాదు కాదు. టిడిపి హయాం వరకు మొత్తం 3 లక్షల కోట్ల వరకు అప్పుడు ఉంటే వైసీపీ ఈ నాలుగేళ్లలో దాదాపు 7 లక్షల కోట్ల వరకు అప్పు చేసిందని, టోటల్ గా ఏపీపై 10 లక్షల కోట్ల అప్పు భారం ఉందని టిడిపి, జనసేనతో పాటు బిజేపి వాదిస్తుంది. ఇటీవల ఏపీ బిజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి అప్పులపైనే మాట్లాడుతూ వచ్చారు.
దాదాపు ఏపీ అప్పు 10.77 లక్షల కోట్లు అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక పురందేశ్వరి విమర్శలకు వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. ఇదే సమయంలో తాజాగా పార్లమెంట్ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్..ఈ నాలుగేళ్లలో ఏపీ చేసిన అప్పుల లెక్క గురించి చెప్పారు. కేవలం 1.77 లక్షల కోట్లు మాత్రమే జగన్ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. దీంతో బిజేపిలోనే ఈ అప్పుల లెక్కలపై తేడాలు కనిపిస్తున్నాయి. కాకపోతే పురందేశ్వరి దీనిపై మరో వాదన వినిపిస్తుంది. నిర్మలమ్మ చెప్పిన లెక్క కరెక్టే అని, కాకపోతే ఆమె ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలో ఉన్న అప్పుల గురించే చెప్పారని, అంటే రిజర్వ్ బ్యాంకుకు లోబడి చేసిన అప్పులు అని, కానీ పరిధి దాటి జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని పురందేశ్వరి చెబుతున్నారు. ఇదే అంశం టిడిపి నేతలు కూడా చెబుతున్నారు.