ఇక్కడ కనిపిస్తున్న చిత్రం.. దుబ్బాకలోని పాఠశాల. ఇది మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇది. భారీగా నిధులు వెచ్చించి అధునాతన హంగులతో నిర్మించిన పాఠశాల ఇది. కానీ సరైన నిర్వహణ లేక ప్రస్తుతం వెలవెలబోతోంది. మెయింటెనెన్స్ సరిగా లేక, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1964-68 మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నుంచి 9వ తరగతి వరకు ఇక్కడే విద్యను అభ్యసించారు. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో 2016లో దుబ్బాకకు వచ్చిన సందర్భంలో తాను చదువుకున్న స్కూలు శిథిలావస్థలో ఉండడాన్ని చూసి ఆయన చలించిపోయారు. దీంతో నూతన భవన నిర్మాణం కోసం రూ.105 కోట్లను కేటాయించారు. 18,787 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్పొరేట్ తరహాలో స్కూల్‌ను నిర్మించాలని ఆదేశించారు. 2020లో కొత్త పాఠశాల నిర్మాణం పూర్తి కాగా 2022 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.
రూ.105 కోట్లను వెచ్చించి కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన ఈ భవనం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నిత్యం ఏదో విధంగా ఆకతాయిలు అద్దాలు పగలగొట్టి వెళితే వాటికి అట్ట ముక్కలు పెట్టి కవర్ చేస్తున్నారు అధికారులు. కనీసం స్కూల్ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయడానికి ఎవరూ లేక టాయిలెట్లు పూర్తిగా అధ్వాన్నంగా మారాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం ఈ పాఠశాలలో 335 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 6 నుంచి 10 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్ ఒకేషనల్ కోర్సు కూడా ఈ భవనంలోనే కొనసాగుతుంది. ఈ పాఠశాలలో మొత్తం 40 గదులు ఉండగా సగం గదులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి,. స్కూల్ దుస్థితి పై పాఠశాల అధ్యాపకులు మాట్లాడుతూ… ఈ పాఠశాలలో రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అంటున్నారు. కొందరు ఆకతాయిలు స్కూల్ అద్దాలను, పైప్‌లైన్‌లను కూడా పగలగొట్టారని చెబుతున్నారు. విద్యార్థుల సైకిల్స్ కూడా ఎత్తుకెళ్తున్నారని చెబుతున్నారు. ఈ పాఠశాల పరిస్థితిపై ఎమ్మెల్యే, ఎంపీ స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కేసీఆర్ చదివిన పాఠశాలకు ఒక నైట్ వాచ్‌మెన్‌తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.