లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి ఓడింది. 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగా ఈసారి స్వంతంగా మెజారిటీ సాధించలేకపోయింది భారతీయ జనతా పార్టీ. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 దాటాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ఎన్డీయే కూటమి లక్ష్యంగా 400 సీట్లను ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఎన్డీయే కూటమికి అందని ద్రాక్షగానే మారింది. 400 సీట్లు కాదు కదా.. కనీసం 300 సీట్లు కూడా కమలదళం సాధించలేకపోయింది.
బీజేపీకి ఈసారి సీట్లు తగ్గడానికి ఒకటి కాదు…రెండు కాదు… అనేక కారణాలున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తమకు దేశవ్యాప్తంగా ఓట్ల వర్షం కురిపిస్తుందని ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆశించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ప్రపంచవ్యాప్తంగా హిందువుల కల సాకారమైంది. అయోధ్యలో రాముడి గుడి కట్టాలన్నది కొన్ని శతాబ్దాల కల. ఈ కలను సాకారం చేసిన ఘనత నిస్సందేహంగా నరేంద్ర మోడీదే. అయితే రామమందిరం హైప్ కొన్ని నెలలకే తగ్గిపోయింది. ఎన్నికలు మొదలయ్యేనాటికి రామమందిర ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. బీజేపీకి సీట్లు తగ్గడానికి ఇదొక కారణం.
ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ తరచూ హిందూత్వ అజెండాను ప్రస్తావించారు. అయితే కిందటిసారి ఓట్ల వర్షం కురిపించిన హిందూత్వ అజెండా ఈసారి ప్రభావం చూపించలేకపోయింది. దీంతో బీజేపీ అమ్ములపొదిలోని ఒక అస్త్రం పార్టీకి పెద్దగా ఉపయోపడలేదు.
విడతలవారీగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశాన్ని బీజేపీ అగ్రనాయకత్వం ప్రస్తావించింది. మూడోసారి బీజేపీ అధికారంలోకి పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ తిరిగి భారత్‌కే దక్కుతుందని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు కమలనాథులు. అయితే మనదేశంలో అనేక సమస్యలున్నాయి.ప్రజలు దైనందిన జీవితంలో ఈ సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతినిత్యం తాము పడుతున్న కష్టాలకు, ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారాలు చూపించాలని ప్రజలు ఆశిస్తారు. అయితే దేశ ప్రజలకు పెద్దగా కనెక్ట్ కాని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశాన్ని కమలనాథులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం సామాన్య ప్రజలకు నచ్చలేదు.
సహజంగా ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని అందరూ భావిస్తారు. ఇది వాస్తవం కూడా. దేశంలోనే అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్‌లో కిందటిసారి మొత్తం 80 సీట్లలో ఎన్డీయే కూటమి 79 సీట్లు గెలుచుకుని హల్‌చల్ చేసింది. ఈసారి మొత్తం 80 సీట్లు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు కమలనాథులు. అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి సీట్లు బాగా తగ్గాయి. కమలం పార్టీ 33 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇండియా కూటమి మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీకి 37 సీట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి ఆరు సీట్లు వచ్చాయి. కిందటిసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం, బీజేపీకి ప్లస్ పాయింట్‌గా మారింది. ఈసారి సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేయడం వల్ల దళితులు, యాదవులు, ముస్లిం మైనారిటీల ఓట్లు ఈ జట్టు వైపు పోలరైజ్ అయ్యాయి. దీంతో కమలం పార్టీ ఓట్ షేర్ పడిపోయింది. ఇండియా కూటమి ఓట్ షేర్ పెరిగింది.
2014 అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చింది. ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. దీంతో విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామ్య పక్షాలను సంప్రదించాలన్న పద్ధతికి బీజేపీ పాటించలేదు. దీంతో నరేంద్ర మోడీ తనకు ఏది సమంజసమనుకుందో… ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పేరుకు ఎన్డీయే కూటమి అయినా బీజేపీ స్వంతంగా తీసుకున్న నిర్ణయాలను భాగస్వామ్య పక్షాలు ఆమోదించాల్సి వచ్చింది.
ఈసారి ఎన్నికలకు ముందు కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ అనంత్‌హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ మాటలను విపక్షాలు అందుకున్నాయి. అనంత్‌హెగ్డే ప్రకటనను పెద్ద ఎత్తున ప్రచారంలోకి పెట్టాయి. దీంతో ఎన్డీయే కూటమికి ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో పెను మార్పులు జరుగుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఊరూవాడా ఏకం చేస్తూ ప్రచారం చేశారు. దీంతో చదువుకున్న వారు, ప్రజాస్వామ్యప్రియులు ఆలోచనలో పడ్డారు. బీజేపీకి దూరం అయ్యారు. మొత్తంమీద రాజ్యాంగాన్ని మార్చివేస్తామంటూ అనంత్ హెగ్డే చేసిన ప్రకటన బీజేపీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.
అలాగే బీజేపీ హ్యాట్రిక్ కొడితే రిజర్వేషన్లు రద్దు అవుతాయని ఇండియా కూటమి చేసిన ప్రచారం కూడా బీజేపీ విజయావకాశాలకు గండి కొట్టింది. రిజర్వేషన్లు రద్దు అవుతాయన్న ప్రచారం జోరందుకోవడంతో ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో ఆదివాసీలు, దళితులు, బలహీనవర్గాలు బీజేపీకి దూరమైనట్లు తెలుస్తోంది. అయితే ఇండియా కూటమి నేతల విమర్శలను ప్రధాని నరేంద్ర మోడీ తిప్పికొట్టినా, పార్టీ యంత్రాంగం దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది.
బీజేపీ అధినాయకత్వం అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి ఫిరాయింపులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ప్రజలకు నచ్చలేదు. ప్రత్యేకించి మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిపోవడం , అంతిమంగా ఏక్‌నాథ్ షిందే కావడాన్ని మహారాష్ట్రవాసులకు మింగుడుపడలేదు. ఈ ఫిరాయింపులకు తొలిరోజుల్లో నిరసన వ్యక్తమైనా అది అప్పట్లో పెద్దగా బయటపడలేదు. అలాగే మరాఠా రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయ వేత్త శరద్ పవార్ పార్టీ సైతం చీలిపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. వీరి అసమ్మతి నిశ్శబ్దంగా ఓట్ల రూపంలో బయటపడింది. ఈ నేపథ్యంలో కిందటిసారి మహారాష్ట్రలో 48 సెగ్మెంట్లలో 41 సెగ్మెంట్లు గెలుచుకున్న ఎన్డీయే కూటమి ఈసారి అందులో అనేక స్థానాలను చేజార్చుకుంది. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌పవార్ పక్షానే ఈ ఎన్నికల్లో ప్రజలు నిలిచారు.
సైనిక దళాల నియామకంలో అగ్నివీర్ పథకాన్ని తీసుకురావడం కూడా ఎన్డీఏ కూటమికి మైనస్ పాయింట్‌గా మారింది. దేశంలోని యువత ప్రత్యేకించి హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహరాష్ట్ర, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సైనికదళాల్లో చేరుతుంటారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కేంద్రం అగ్నివీర్ పథకాన్ని తీసుకువచ్చింది. అగ్నివీర్ ద్వారా సైనికదళాల్లో చేరే వారిలో కేవలం 25 శాతం మాత్రమే పూర్తిస్థాయిలో కొనసాగుతారు. మిగిలిన వారు నాలుగేళ్లకే రిటైర్ కావాల్సి ఉంటుంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనా బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో యువత ఓట్లు ప్రతిపక్షాలకు పడ్డాయి.


