తెలంగాణలో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం రంజుగా సాగుతున్న వేళ.. రుణమాఫీతో హస్తం పార్టీ మరింత జోష్‌లో ఉంటే.. బీఆర్‌ఎస్ ఇంకా గందరగగోళంలో పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకాశముందంటున్నారు. దీంతో కాంగ్రెస్ ఉత్సాహంలో ఉంటే, గులాబీ నేతలకు మాత్రం ఇంకా గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి ఉందంటున్నారు.
తెలంగాణలో రైతు రుణమాఫీతో అన్నదాతల మనసు దోచుకున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి కలిసొచ్చే కాలం కనిపిస్తుండటంతో హస్తం నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారని.. దీంతో జనంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనానికి మరింత విశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు రుణమాఫీపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ స్థాయి నేతలు సంబరాల్లో పాల్గొంటుండగా, రైతులు రేవంత్, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంపై బీఆర్‌ఎస్ నేతలు అయోమయంలో పడ్డారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. ఈ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం మూటకట్టుకోవాల్సి వస్తుందన్న కలవరంలో పడ్డారు. ప్రభుత్వాన్ని నిలబెట్టడం, కూల్చేయగల శక్తి రైతులకు ఉన్నందున ఈ భయం గులాబీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇక కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే చాలా మంది గులాబీ శిబిరాన్ని వదిలి హస్తం చేయందుకున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీతో కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ పెరగనుండటంతో.. ప్రస్తుతం ఉన్న నేతలు కూడా తమను వదిలి కాంగ్రెస్ చేరుతారేమో అన్న ఆందోళనలో ఉంది బీఆర్‌ఎస్ హైకమాండ్.
రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుతో మాజీ మంత్రి హరీష్‌రావు రాజీనామాపై జోరుగా చర్చ సాగుతోంది. గతంలో రుణమాఫీపై రేవంత్ వర్సెస్ హరీష్‌రావు మధ్య సవాళ్ల రాజకీయం నడిచింది. ఆగస్ట్ 15లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు సీఎం రేవంత్‌రెడ్డి. దానికి కౌంటర్‌గా సవాల్ చేశారు హరీష్‌రావు. చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఆ సవాల్‌పై అప్పట్లోనే దుమారం రేగింది. రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండు అంటూ ప్రతి సవాల్ విసిరారు రేవంత్. ఈ క్రమంలోనే గన్‌పార్క్ వద్దకి రాజీనామాతో వెళ్లారు హరీష్‌రావు. అలా పొలిటికల్ హీట్‌ను పెంచిన సవాళ్ల పర్వం ఆ తర్వాత కాస్త సద్దుమణిగింది. అయితే.. రుణమాఫీ అమలుతో మళ్లీ రాజీనామా వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తున్నారంటూ ట్రోల్ చేస్తోంది కాంగ్రెస్ వర్గం. మొత్తంగా రుణమాఫీతో రాజీనామాల రాజకీయం మళ్ళీ తెర మీదికి వచ్చింది. ప్రతిపక్షం ఇరుకున పడిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తుండగా… సవాళ్ళ విషయంలో సర్దిచెప్పుకోలేక బీఆర్‌ఎస్ సతమతం అవుతోందన్న టాక్ వినిపిస్తోంది.