విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఫిజికల్ డైరెక్టర్.. విద్యార్థులపై విరుచుకుపడిన ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది ఆలస్యంగా నిద్రలేచారని స్టడీ అవర్‌కు, ఆలస్యంగా వచ్చారని ఊగిపోయి దొరికిన వారిని దొరికినట్టుగా కట్టెలతో చితకబాదాడు ఫిజికల్ డైరెక్టర్.
దుద్దెడలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఇంటర్‌తో పాటు పదో తరగతి విద్యార్థులకు ఉదయం స్టడీ అవర్స్ ఉంటాయి. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విద్యార్థులను వాచ్‌మెన్ భరత్ 5.20 గంటలకు వచ్చి నిద్ర లేపాడు. ఆలస్యమైందని విద్యార్థులంతా స్నానానికి వెళ్లారు. కొంతమంది గదిలోనే ఉన్నారు. విద్యార్థులు రావడం ఆలస్యమైందని పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వాసు కోపంతో ఊగిపోయి స్పెషల్ క్లాస్‌కు వెళ్తున్న 20 మందికి పైగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను, 10 మంది పదో తరగతి విద్యార్థులను వరుసగా నిలబెట్టి దొడ్డు కర్రలతో వెనుకా, చేతులపై చితకబాదాడు.
దాంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కూర్చోవడం కూడా కష్టంగా మారింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 20 మందిలో హర్షవర్ధన్, అజర్ అనే ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో అజర్‌ని సిద్దిపేట ఆస్పత్రిలో చికిత్స చేయించినట్టు సమాచారం. హైదరాబాద్ రామంతపూర్‌కు చెందిన హర్షవర్ధన్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో తట్టుకోలేక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దాంతో వారు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశువులను బాదినట్టుగా కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. పిల్లలను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్‌ను, దొడ్డు కర్రలను తీసుకువచ్చిన వాచ్‌మెన్ భరత్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కుమారునిపై వాతలు చూసిన హర్షవర్ధన్ తల్లి కంటతడి పెట్టారు. తప్పు చేస్తే మందలించాలని కానీ పశువులను బాదినట్టు కొట్టడం ఏమిటని కన్నీరుమున్నీరయ్యారు.