ఏపీలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. పోలింగ్‌కు టైం దగ్గర పడుతుండడంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్డీయే కూటమి దూకుడు పెంచింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఇద్దరు అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. అంబాజీపేటతో పాటు అమలాపురంలో జరిగే సభల్లో పాల్గొంటారు. అలాగే నిడదవోలులో పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.
నిన్న పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. తణుకులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఇద్దరు అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దోపిడి, దుర్మార్గ ప్రభుత్వాన్ని బూడిద చేసే రోజు మే 13న వస్తుందని చంద్రబాబు చెప్పారు. మరోవైపు వాలంటీర్లపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని, వారి జీతం 5 వేల రూపాయల నుంచి 10వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. వాలంటీర్లను చెడగొట్టాలని జగన్ చూస్తున్నారని, అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనపై శ్రద్ధ పెడతామని హామీ ఇచ్చారు.
మరోవైపు ప్రజలు బాగు కోసమే తాను తగ్గానని అన్నారు పవన్ కళ్యాణ్. ఓట్లు చీలకూడదన్న ప్రధాన లక్ష్యంతో ముందుకువెళ్తున్నామన్నామని చెప్పారు. ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో కూడా తనకు బాగా తెలుసని చెప్పారు. అందుకే ప్రజలు, యువత బాగు కోసం జనసేన అభ్యర్థులు త్యాగాలు చేశార న్నారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలనే చంద్రబాబుతో, ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించి ఈ కూటమిని తీసుకువచ్చామని పవన్ తెలిపారు. ఇక మొన్నటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు ..ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడెక్కింది. అంతేకాకుం డా చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.


