స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) ఇప్పుడు మరో భారీ మిషన్ కు సన్నద్ధమయింది. సూర్యుడి రహస్యాలను శోధించేందుకు రెడీ అయింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1 (ADITYA L_-1) ప్రయోగాన్ని చేపట్టబోతోంది. రేపు ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1ను నింగిలోకి పంపనుంది.
ఈ ఉదయం 11.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. రేపు భారీ ప్రయోగాన్ని చేపట్టనున్న నేపథ్యంలో సూళ్లూరుపేటలోని శ్రీచెంగాలమ్మ అమ్మవారి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన పూజలు చేశారు.