లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి.. ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది.. గతంతో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీలు సైతం బలాన్ని పెంచుకున్నాయి.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు AICC నియమించిన జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. కురియన్‌తో పాటు రకీబుల్ హుస్సేన్, పర్గత్‌సింగ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మూడు రోజుల పాటు గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో వరుసగా భేటీ కానున్నారు. మొదటి రోజు గెలిచిన, ఓడిపోయిన 17 ఎంపీ అభ్యర్థులకు గాంధీ భవన్ నుంచి ఇప్పటికే పిలుపు రావడంతో వారంతా వచ్చారు. ఒక్కో అభ్యర్థికి ముప్పై నిమిషాల సమయాన్ని కమిటీ కేటాయించింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు.
రెండోరోజు కూడా కురియన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైంది. ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకుంది. ప్రధానంగా కాంగ్రెస్ గెలుస్తుందనుకున్న లోక్‌సభ స్థానాల్లో ఓటమికి కారణాలపై వారిని కమిటీ సభ్యులు ఆరా తీస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఓటమికి కారణాలను అడిగి తెలుసుకుంటుంది. మూడో రోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది కురియన్ కమిటీ. ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు కమిటీ సభ్యులు వెళతారా..? లేదా..? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధానంగా చేవెళ్ల, మల్కాజిగిరి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్ వంటి స్థానాల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులేమిటనే కోణంలో అధిష్ఠానం ఆరా తీస్తోంది.
ఈ లోక్‌సభ స్థానాల పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గినా.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై కమిటీ విశ్లేషణ జరుపుతుంది. ఆయా స్థానాల నేతలు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఇప్పటికే పార్టీ సూచించింది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో స్థానిక నేతలు సరిగా పనిచేయలేదనే ఆరోపణలు సైతం ఉండటంతో వారి గురించి వివరాలు సేకరిస్తోంది. నేతల పనితీరు, పోల్ మేనేజ్‌మెంట్‌కు తీసుకున్న చర్యలు, పార్టీ ప్రచారం జరిగిన తీరు, నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది అనే కోణాల్లో కమిటీ సమాచారాన్ని సేకరిస్తోంది.
కురియన్ కమిటీ ముందు తమ ఓటమికి కారణాలు చెప్పుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా సొంత పార్టీ నేతల వల్లే ఓడిపోయామని ఎక్కువ మంది చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానంలో అన్ని చోట్లా కాంగ్రెస్ గెలిచినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరిలో పరాజయం ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి మెజార్టీ వచ్చినా.. ఇతర చోట్ల బీజేపీ అభ్యర్థికి ఓట్లు పడటంతో వంశీచందర్ రెడ్డి స్వల్ప తేడాతో ఓడిపోయారు.
అలాగే సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల, మెదక్ వంటి చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నా.. సద్వినియోగం చేసుకోలేకపోయారన్న దిశగా కురియన్ కమిటీ పరిశీలన జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలు తమకు ఎలా సహకరించలేదో చెబుతూ.. వారికి పట్టు ఉన్న పోలింగ్ బూత్‌లలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలను కురియన్ కమిటీ ముందు పెడుతున్నట్లుగా పలువురు నేతలు చెబుతున్నారు. గాంధీ భవన్‌లో కురియన్ కమిటీతో భేటీ అయ్యేందుకు గెలిచిన అభ్యర్థులతో పాటు టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా వస్తున్నారు.
కమిటీ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో ఏఐసీసీకి అందిస్తామని కురియన్ కమిటీ స్పష్టం చేసింది. టికెట్ రాని నేతలు సైతం తమ వాదనను కురియన్ కమిటీకి వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై పలు రాష్ట్రాల్లో ఏఐసీపీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలను వేసింది.