వివాహమైన కొత్తజంట సంతోషంగా కొన్ని క్షణాలు అనుభవిద్దామనుకునేలోపే.. వరుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. వివాహం జరిగిన మూడవ రోజే వరుడు మృత్యు ఒడికి చేరడంతో.. ఇరువురు కుటుంబాల్లో విషాదం నిండిపోయింది. పచ్చని పందిరి , ఇంకా పారాణి ఆరకముందే ఈ ఘటన జరుగడంతో బంధువులు తీవ్రంగా రోదిస్తున్నారు. తమ వివాహానికి గిఫ్ట్ గా వచ్చిన హోమ్ థియేటర్ ని స్టార్ట్ చేయడంతో అది పేలిపోయి వరుడు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
కబీర్దామ్ జిల్లా రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో కొత్తగా పెళ్ళైన వధూవరులుతమకు వచ్చిన గిఫ్ట్ ను ప్రారంభిద్దామని అనుకున్నారు. టీవీకి హోమ్ థియేటర్ ఫిక్స్ చేసి స్విచ్ ఆన్ చేశాడు వరుడు హేమేంద్ర. దీంతో ఒక్కసారిగా బగ్గుమని పేలడంతో హేమేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు అతని బంధువు కూడా చనిపోయాడు. అక్కడే ఉన్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భార్య, ఇరువురి బంధువులు తీవ్రంగా రోదించారు. కుటంబ సభ్యుల రోదనతో గ్రామంలో విషాద ఛాయలు మిన్నంటాయి.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి చూసే సరికి హేమేంద్ర, మరో వ్యక్తి చనిపోయాడు. మిగితా ఆరుగురు తీవ్ర గాయాలతో అవస్థ పడుతున్నారు. వెంటనే వారందరిని స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. మృతదేహాలను శవ పరీక్షల కోసం పంపించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా ఠాకూర్ మీడియాకు తెలిపారు.