గత కొన్నేళ్లుగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ వస్తోంది. దీని ప్రభావం వల్ల ప్రస్తుతం అనేక దేశాలు వరదలు, కరవు లాంటి ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొంటున్నాయి. దీనికి సంబంధించి వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి ఏడాది వివరాలను వెల్లడించింది.
ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన పదేళ్లలో ప్రతి ఏడాది ఎండలు రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు భూమ్మీద అత్యంత వేడి ఏడాది 2024 అని పేర్కొన్నారు. ఈ మేరకు వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు, గతేడాదిలో గ్లోబల్ వార్మింగ్ హద్దులనూ దాటేశామని, గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ 1.5 డిగ్రీలను దాటిపోయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
2024లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.6 డిగ్రీలు పెరిగిందని యురోపియన్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించగా.. జపాన్ శాస్త్రవేత్తలు వేసిన లెక్కల్లో ఇది 1.57 డిగ్రీలు పెరిగిందని తేలింది. బ్రిటన్ పరిశోధకుల లెక్కల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.53 డిగ్రీలుగా ఉంది. ఆయా సంస్థలు వేర్వేరు పద్ధతులు అనుసరించి గణించినా సగటు ఉష్ణోగ్రత 1.5 పైనే నమోదు అయింది. మొత్తంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిస్ అగ్రిమెంట్ ను అధిగమించిందని, గ్లోబల్ వార్మింగ్ దుష్ప్రభావాలకు తొలి సూచన అని సైంటిస్టులు చెప్పారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 2023లో 14.98 డిగ్రీలు నమోదైతే.. 2024లో అది 0.12 డిగ్రీలు పెరిగి 15.10 డిగ్రీలకు చేరిందని చెప్పారు.
ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతూ పోవడానికి ప్రధాన కారణం వాతావరణంలో పెరిగిపోతున్న గ్రీన్ హౌస్ వాయువులేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై శిలాజ ఇంధనాలు.. ఆయిల్, గ్యాస్, బొగ్గులను మండించడం వల్ల పెద్ద మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులు వెలువడుతున్నాయని, అవి నేరుగా వాతావరణంలో కలిసి కలుషితం చేస్తున్నాయని వివరించారు. ఉష్ణోగ్రతలు లెక్కించడం ప్రారంభించిన నాటి నుంచి అత్యంత వేడిమి రోజు 2024, జూలై 10 అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రోజు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న గ్లోబల్ వార్మింగ్‌ను కట్టడి చేయాలంటే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా చూడాలన్న లక్ష్యంతో 2015, డిసెంబర్ 12న పారిస్ లో జరిగిన యూఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ – కాప్ లో 196 భాగస్వామ్య దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ స్థాయిలను పారిశ్రామిక విప్లవం ముందు నాటి కంటే గరిష్టంగా 2 డిగ్రీలకు మించి పెరగకుండా చూడాలని అన్ని దేశాలు అంగీకరించాయి.