మొన్నటిదాకా కరోనా ప్రపంచాన్ని గజగజ వణికిస్తే.. ఇప్పడు మరో కొత్త వైరస్ మరో అల్లకల్లోలం సృష్టించడానికి వస్తుంది. దేశంలో మరో కొత్త వైరస్ ‘హాంగ్‌కాంగ్‌ఫ్లూ హెచ్3ఎన్2’ వేగంగా వ్యాపిస్తోంది. ఈ మాయదారి రోగం తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మొన్నటి వరకూ కరోనా..ఇప్పుడు H3N2 వైరస్.. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఈ పేరు చెప్తే ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది. H3N2 వైరస్ కారణంగా సోకే ఇన్‌ఫ్లూయెంజానే హాంగ్‌కాంగ్ ఫ్లూ అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక కేసు హర్యానాలో రాగా.. మరొ కేసు కర్ణాటక లో వచ్చింది.
మొదటగా ఒకటి, రెండు కేసులే నమోదైన ఇప్పుడు క్రమక్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 90 మందిలో ఈ వైరస్ కేసులు నిర్ధారించారు. అదేవిధంగా ఎనిమిది H1N1 వైరస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఎండాకాలం టైంలో ఫ్లూ జ్వరాలు దేశమంతటా పెరిగిపోతున్నాయి. అందులో H3N2 వైరస్ కారణంగా వచ్చే ఫ్లూ జ్వరాలే ఎక్కువగా ఉండటంలో జనాల్లో భయం మొదలైంది. గత రెండు నెలలుగా ఈ ఫ్లూ కేసులు అధికంగా పెరుగుతున్నాయి. ఈ వైరస్ సోకితే దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు వైద్యులు.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ క్రమక్రమంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా నమోదౌతున్నట్లు వైద్యులు గుర్తించారు. విశాఖలోని ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో పెద్దాసుపత్రితో పాటు, ప్రైవేట్ ఆసుపత్రులకు రోజూ వందల మంది వస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో ఈ వైరస్ భయం పట్టుకుంది.