ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రస్తుతం 2 లక్షలా 68 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. అప్పటి కల్లా 58 లక్షలు అవుతందని తెలిపారు. సచివాలయంలో రాష్ట్ర వృద్ధి రేటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జీవనాడి అన్నారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారంటూ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వ హయాంలో సంపద సృష్టించి.. ప్రజల ఆదాయం పెంచుతామన్నారు. అభివృద్ధి వల్ల సంపద వచ్చి.. ప్రజల ఆదాయం పెరుగుతుందన్నారు ఏపీ సీఎం. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు చంద్రబాబు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇంటిని జియో ట్యాగ్ చేసి, కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. విపత్తుల సమయాల్లో పరిహారం అందించేందుకు జియో ట్యాగ్ ఉపయోగపడుతుందన్నారు. గతంలో హైదరాబాద్‌ను డెవలప్ చేసింది తానేనన్నారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఇప్పుడు ఆ ఫలితాలు వస్తున్నాయన్నారు.
వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకు వెళుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. విజన్ డాక్యుమెంట్‌కు దేశంలో తొలిసారి 16 లక్షల వ్యూస్ వచ్చాయన్నారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చడమే లక్ష్యమన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు నిరంతరం శ్రమించాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలను ఆర్థికంగా పైకి తెచ్చేందుకు పీ4 గేమ్ ఛేంజర్ కానుందన్నారు. సంపద సృష్టిలో మాత్రం పీ3 గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందన్నారు ఏపీ సీఎం. గతేడాదితో పోలిస్తే ఈసారి 4.03 శాతం వృద్ధి సాధించామన్నారు సీఎం చంద్రబాబు. వృద్ధి రేటును 12.94 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. 15 శాతం వృద్ధి రేటు సాధిస్తూ వెళితే.. ఏడాదికి అదనంగా 20 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని విమర్శించారు చంద్రబాబు. వైసీపీ పాలన ఉన్నప్పుడు ఎవరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారంటూ గత ప్రభుత్వంపై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు.