సరదాల సమాహారం, సంప్రదాయల కదంబాన్ని పండువగా భావిస్తే.. ఈ పండువల్లో పెద్ద పండగగా మకర సంక్రాంతి పేరు ప్రతిష్ఠలు సంతరించుకుంది. సంక్రమణం అంటే మార్పు, కదలిక అని పెద్దలు చెబుతారు కదా..! ఆరోగ్యకర, ఆహ్లాదకర నూతన మార్పుతో.. బద్దకాన్ని, బడాయితనాన్ని పక్కకు పెట్టి చైతన్యవంతమై కదలికతో ముందుకు సాగే మహత్తర పర్వదినం మకర సంక్రమణం. మూడు రోజుల మహత్తర పండువ మకర సంక్రాంతిలో దర్శనమిచ్చే వేడుకలు అన్నీఇన్నీ కావు. క్రాంతివంత సంక్రాంతి నూతన కాంతుల సౌరభాలపై ప్రత్యేక కథనం.
ఇటు భోగి అటు కనుమ నడుమ సర్వొన్నత, సర్వోత్తమ దైవమైన స్థితి కారకుని మాదిరి విశిష్ట ఘనత సంతరించుకున్న మహోన్నత, మహత్తర పండుగ సంక్రాంతి పండుగ. ఏ పండువలో లేని విశిష్టతలన్నీ సంక్రాంతి పండువలో దర్శనమిస్తాయి. అందుకే దీనిని పెద్ద పండువగా అభివర్ణిస్తారు.
రైతన్నలు కష్టపడి పండించిన పంట ఇంటికి చేరే సమయంలో ధాన్యలక్ష్మికి పలు రీతుల్లో స్వాగతం చెబుతారు. సముద్రరాజ తనయి శ్రీ మహాలక్ష్మిని పౌష్య లక్ష్మిగా ఆరాధించి ఆహ్వానిస్తారు. ఇళ్ల ముందు రంగు రంగుల రంగవల్లులను వేసి, పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు ఇళ్ల ముందు పేర్చి ఆట, పాటలతో లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తారు. ఈ వేడుక సంక్రాంతి పర్వదినాల్లో దర్శనమిస్తుంది. నూతన వస్త్రాలు ధరించి ఈ వేడుకలు చేసుకుంటారు.
పండువ అంటే విందులు, వినోదాలు, సరదాలు. ఇక పెద్ద పండువ సంక్రాంతి అంటే చెప్పేదేముంది. పాలు పొంగించి.. పరమాన్నం తయారు చేసి దైవాలకు నివేదిస్తారు. పాలు పొంగినట్టు సిరులు పొంగినందుకు సంబరపడుతూ పాయసం చేసి నివేదిస్తారు. కట్టు పొంగలి, చక్రపొంగలి, పులిహోర, దద్దోజనం గారెలు ఇలా ఎన్నో వంటకాలను భగవత్ నివేదన చేసి.. మృష్టాన్న భోజనంగా ఆ పదార్థాలను ఆరగిస్తారు. పది మందికి పంచిపెడతారు. ఇక సంక్రాంతికి నెల్లాళ్ల ముందు నుంచి అందరి ఇళ్లలో తినుబండరాల తయారీ మొదలవుతుంది. మిఠాయిలు, అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలకాయలు.. ఇలా ఎన్నో స్వీట్లు, హాట్లు తయారు చేసి, పండగ దినాల్లో సరదా కబుర్లతో ఆరగిస్తారు. కొత్త అల్లుళ్లు, కొంటె మరదళ్ళ సరదా ఘట్టాలన్నీ జరిగేవి సంక్రాంతి వేడుకల్లోనే.
సంక్రాంతి నాడు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలని పురాణాలు చెబతున్నాయి. అయితే, మిగిలిన సంక్రమణాల్లో ఏ కారణాల వల్లయినా తర్పణం ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణానికి ఇచ్చే తర్పణంతో ఆ పుణ్యఫలం దక్కుతుంది. ఇందుకే.. మకర సంక్రమణం నాడు తప్పక పితృ తర్పణాలు ఇవ్వాలని పౌరోహిత్య పెద్దలు చెబుతున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైనదే అని పెద్దలు తెలియజేస్తున్నారు.
సంక్రాంతికి కోడి పందేలకు ఎంతో సామీప్యం ఉంది. దీన్ని పందెం రాయుళ్లు సంప్రదాయ వేడుకగా నిర్వహిస్తారు. కోడి పందేలపై నిషేధం ఉన్నా.. ఏనాడు ఇవి నిలిచిపోయిన సందర్బాలు కనిపించవు. పందెం కోళ్లకు ఏడాది పొడవునా ఎంతో బలవర్థకర మేత ఇచ్చి, సౌకర్యాలు కల్పించి, ప్రత్యేక శిక్షణ ఇచ్చి పందేలకు సిద్దం చేస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ పందేల్లో కూటికి లేనివారు కోటీశ్వరులు, కోటీశ్వరులు బీదవారిగా మారే సందర్భాలు ఉన్నాయి. ఎకరాలకు ఎకరాలు పందేల్లో పెట్టడం ఇక్కడ ఆనవాయితీ.
కాలానుగుణ మార్పుల్లో సంప్రదాయాలపై ఆసక్తి తగ్గినా పూర్తిగా కనుమరుగు మాత్రం కాలేదు. గ్లోబలైజేషన్, సాఫ్ట్ వేర్ రంగం పుణ్యమా అని దేశంలోని ఎందరో విద్యాధికులు విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రతి పండుగను ఆయా దేశాల్లోని భారతీయులు ఘనంగా చేసుకోవడం శుభపరిణామం. ఇక సంక్రాంతి సంబరాలు విదేశాల్లో అంబరాన్నంటేలా చేసుకోవడం కనిపిస్తోంది.
భగీరథుడు గంగామాతను భువి నుంచి దివికి తీసుకొచ్చింది సంక్రాంతి రోజునే అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. గజముఖుడు గణేశుడికి గజాసురుడి శిరస్సు అమర్చిన గాథ మనకు వినాయకచవితి మహత్యంలో తెలుస్తుంది. అయితే, మహా శివభక్తుడైన గజాసురుడు శివదేవుని మెప్పించి ఎన్నో వరాలు పొందాడు. చివరకు పరమేశ్వరుడినే తన ఉదరంలో ఉండే వరం కోరుకున్నాడు. భోళా శంకరుడు, ఉబ్బు శంకరుడు ఆ వరాన్ని ఇచ్చేశాడు. వరగర్వంతో హద్దులు మీరి ప్రవర్తించి, సాధుజనులు, దేవతాగణాలపై అసుర ప్రవృత్తి ప్రదర్శించాడు. దీంతో, ఆ రాక్షస బాధలు తాళలేక లోకాలన్నీ కకావికలం అయ్యాయి. అప్పడు బ్రహ్మ, విష్ణువు గందిరెద్దు మేళా వేడుకలతో గజాసుర వధ చేస్తారు. ఈ ఘటన చోటు చేసుకున్నది సంక్రాంతి నాడే కావడంతో…ఈ పండుగలో మనకు గంగిరెద్దు విన్యాసాలు దర్శనమిస్తాయని పెద్దలు చెబుతున్నారు.
ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగటిపూట కావడంతో గగనంలో దేవతా విహారం జరుగుతుందని, దేవతాగణానికి స్వాగతం చెప్పేవే గాలిపటాలు అనే కథనం ఉంది. సర్వవేళలా హరినామస్మరణ చేస్తూ సమస్త లోకాలకు వెళ్లే నారదమహర్షికి కాస్తంత విశ్రాంతి కల్గించడానికి శ్రీమహావిష్ణువు సంకల్పించి. అరవై మంది భామినిలతో నారదుడు సంసారకూపంలోకి దిగినట్టు కథనం ఉంది. ఈ అరవై మంది భామినిలే .. ప్రభవ, విభవ ఆదిగా గల అరవై తెలుగు సంవత్సరాలుగా చెబుతారు. అయితే, తనంత భక్తుడు ఎవరూ లేరని నారదుడు కించిత్ అహం ప్రదర్శించడంతో.. శ్రీమహావిష్ణువు.. ఈ నారదమాయ ఘట్టాన్ని సృష్టించినట్టు తెలియజేస్తారు.
నారదుడు సంసారజంజాటంలో ఉన్న సమయంలో నారద పాత్రలో శ్రీమన్నారాయణుడే భువి నుంచి దివికి వచ్చి హరిదాసు పాత్రలో.. హరిలో రంగ హరి వచ్చినట్టు.. ఇది జరిగింది ధనుర్మాసంలో అనే కథనం ఉంది. అందుకే హరిదాసు అంటే సాక్షాత్ శ్రీహరే అని చెబుతారు.
హరిదాసులు, కోడి పందేలు, ఎడ్ల పందేలు, పొట్టేళ్ల పోటీలు, పగటి వేషగాళ్లు, గంగిరెద్దు మేళాలు, ముగ్గుల పోటీలు, దైవ పూజలు, గతించిన పెద్దల స్మరణలు, మూగజీవాల ఆరాధనలు, అలంకరణలు, పిండి వంటలు, మృష్టాన్న భోజనాలు..ఓహ్ ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో సరదాలు, సంబరాలు, ఆట పాటలు, వేడుకలు. అంతా సంక్రాంతిమయం.