ఉస్మానియా ఆస్పత్రికి మహర్దశ కలగనుంది. నిజాం కాలం నాటి ప్రస్తుత ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త ఆస్పత్రి నిర్మించేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గోషామహల్‌లోని గ్రౌండ్‌లో నిర్మించేందుకు లే అవుట్ సిద్ధం చేసింది.
శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కొత్త భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీంతో 30 ఏళ్ల కల సాకారం కానుంది. శిథిలావస్థకు చేరిన భవనం పెచ్చులూడటం, డాక్టర్లు, సిబ్బంది నిరసనలకు ఇక చెక్ పడినట్లే. సరైన సౌకర్యాలు లేకుండా రోగులు, వారి బంధువుల అవస్థలు కూడా ఈ కొత్త భవన నిర్మాణం పూర్తయితే తీరనున్నాయి.
అధునాతన సదుపాయాలతో, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌తో గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌లో కొత్త ఆస్పత్రి నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 26.30 ఎకరాల విస్త్రీర్ణంలో కొత్త భవనాలను నిర్మించనున్నారు. 2వేల పడకలతో కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా నిర్మించబోతున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 22 విభాగాలు ఉండగా.. అదనంగా మరో 8 విభాగాలను కూడా చేర్చారు.
ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, పేషంట్ అటెండెంట్ల కోసం ఆస్పత్రి ఆవరణలోనే ధర్మశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇక స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు. మోడ్రన్ మార్చురీలు, రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ ఉండబోతుంది. రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్టుగా ఆస్పత్రి కొత్త భవనం నిర్మించనున్నారు. రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ ఉండనుంది.
మొత్తం 8 బ్లాక్‌లు ఉండబోతున్నాయి. రూ. 2,500 కోట్లతో 14 అంతస్తుల్లో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలతో పాటు 750 సీట్ల కెపాసిటీతో భారీ ఆడిటోరియం కూడా ఉండనుంది. జీ+12గా బాయ్స్ హాస్టల్, ఫ్యాకల్టీ రెసిడెన్షి, గర్ల్స్ హాస్టల్ కూడా.. హాస్పిటల్ ప్రాంగణంలోనే ఉండేలా డిజైన్ చేశారు.