స్వతంత్ర, వెబ్ డెస్క్: తనదైన స్టైల్ లోఐటీ మంత్రి కేటీఆర్ ను ఏకిపారేశారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. చిన్న దొర కేటీఆర్ కు తల పొగరు హిమాలయాలకు పాకింది అంటూ మండిపడ్డారు. ప్రజాదర్భార్ పెట్టవద్దట. ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పుకోవద్దట. అట్ల చేస్తే వ్యవస్థలో లోపం ఉన్నట్లట. లోపం వ్యవస్థలో కాదు కేటీఆర్ గారు.. మీ చేతకాని పాలనే తెలంగాణకు పెద్ద లోపం… అంటూ మరో దండకాన్ని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
ప్రజా దర్బార్ చేయాలంటే ప్రజలకు మంచి చేస్తామన్న నమ్మకం ఉండాలి. ప్రజల సమస్యలు తీర్చాలని మంచి మనసు ఉండాలి. ప్రజల మధ్య దర్బార్ పెట్టాలంటే దమ్ముధైర్యం ఉండాలి. అది లేకనే తొమ్మిదేండ్లుగా మీ పాలన ఫామ్ హౌజ్ కే పరిమితం అయింది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని, రాష్ట్రాన్ని ఉద్ధరించునట్లు ఉపన్యాసాలు ఇచ్చినా జనం నమ్మే స్థాయిలో లేరు. అందుకే మీరు ఎక్కడ పర్యటిస్తే అక్కడ మీ కార్లను వెంబడించి జనం కొడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ నిలదీస్తున్నారు.చేతకాని దద్దమ్మలు అని తిడుతున్నారు. రాష్ట్ర సంపదను పందికొక్కులా మెక్కుతూ, జనం ఏమైపోతే మాకెందని చూసే దద్దమ్మలు మీరు. పింఛన్, రేషన్ కార్డ్, పాస్ బుక్ లో పేరు మార్పు కోసం ముఖ్యమంత్రి వద్దకు రావొద్దట! కొత్త పింఛన్ల కోసం 15లక్షల మంది ముఖ్యమంత్రి సంతకం కోసం వేచిచూస్తుంటే అది వ్యవస్థలో లోపమా? కేసీఆర్ పనితనంలో లోపమా? నాలుగేండ్లుగా రేషన్ కార్డులు ఇయ్యక పోవడం,లక్షల ఫైళ్లు పెండింగ్ లో పెట్టడం వ్యవస్థలో లోపమా? కేసీఆర్ పనితీరులో లోపమా? దర్బార్ పెడితే మీ దోపిడీలు బయట పడతాయని భయం. దర్బార్ పెడితే మీ బందిపోట్ల కబ్జాలు వెలుగులోకి వస్తాయని భయం. దర్బార్ పెడితే మీ అరాచకాలను జనం నిలదీస్తారని భయం. దర్బార్ పెడితే మీ అవినీతిపై ప్రజలు ప్రశ్నిస్తారని వణుకు. అందుకే ప్రజా దర్బారుకు మొహం చాటేసి, దొర ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యిండు…అంటూ విరుచుకు పడ్డారు.
సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. దొరల పాలన సాగిస్తూ, నోరెత్తితే చావకొట్టడమే ఇన్నాళ్లు మీరు నడిపిన పాలన. ముఖ్యమంత్రేమో ప్రజలకు కనిపించడు. మంత్రులేమో కేసీఆర్ భజనకే సరి. ఎమ్మెల్యేలంతా అవినీతి మేతలోనే. ఆదేశాలు లేక అధికారులకు అర్థం కాని పరిస్థితి. జనం గోసలు వినేటోడు లేడు. సమస్యలు పట్టించుకొనే వాడు కానరాడు. ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకు ఏం కావాలో అడిగిన ఎకైన దమ్మున్న ముఖ్యమంత్రి వై ఎస్ఆర్ మాత్రమే. ప్రజల సమస్యలు వినాలన్నా, పరిష్కారం కావాలన్నా మళ్ళీ వైఎస్ఆర్ తోనే అది సాధ్యం..అంటూ చెప్పుకొచ్చారు.


