ఎన్నికల నగారా మోగడంతో దేశ వ్యాప్తంగా ఎలక్షన్ సందడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు దిశగా మరింత స్పీడ్ పెంచి ప్రచార ప్రభంజనంతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ పై ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. స్వయంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగి వరుస పర్యటనలు, ప్రచారాలతో కమలనాథుల్లో మరింత జోష్ పెంచుతున్నారు. ఇటీవలే మల్కాజిగిరిలో భారీ ఎత్తున రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించగా.. ఇవాళ జగిత్యాలలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పై విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడ్డారు మోదీ.
తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పతనం తప్పదని అన్నారు ప్రధాని మోదీ. జగిత్యాల జిల్లా విజయసంకల్ప సభలో పాల్గొన్న ఆయన.. హస్తం, గులాబీ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీకి ఓటు వేయాలి… 400ల సీట్లు దాటాలంటూ ప్రజలకు తెలుగులో పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ కోసం బీజేపీని గెలిపించాలని కోరారు.
తాను భారతమాత పూజారినని అన్నారు మోదీ. శక్తి వినాశనాన్ని అడ్డుగా నిలబడతానన్నారు మోదీ. శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ సవాల్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తెలుస్తుందన్నారు. బీఆర్‌ఎస్ అవినీతిని ప్రశ్నించడం కాంగ్రెస్ మానేసిందని ఆరోపించారు ప్రధాని. గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. రెండు పార్టీలు కూడా మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కుటుంబ రాజకీయం చేసే బీఆర్‌ఎస్ కాళేశ్వరంలో దోచుకుంది సరిపోక.. ఢిల్లీ లిక్కర్ దందా చేసి కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శలు గుప్పించారు.