స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో కొద్దీ రోజులుగా హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలతో ముగిసింది. కర్ణాటక సింహాసనాన్ని అధిష్టించేందుకు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తమతమ బడా నేతలతో ప్రచారం నిర్వహించారు. తాము గెలిస్తే.. రాష్ట్రానికి ఏమేం చేస్తామో.. ఆ హామీలన్నీ వివరించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు, స్థానిక సమస్యల ప్రక్షాళన వంటి అంశాలతో దూసుకెళ్లారు. ప్రధానంగా క్యాంపెయిన్ లో ప్రతిపక్షాలపై విరుచుకుపడడం, తాము చేసిన అభివృద్ధిని చర్చించడం, రోడ్ షోలు వంటి అనేక ప్రచారాలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో 2,613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బుధవారం పోలింగ్ నిర్వహించి.. 13న ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగనుంది.
రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా 113 అసెంబ్లీ స్థానాలు గెలవాల్సి ఉంది. ఇక మొత్తం 224 సీట్లలో 36 సీట్లు ఎస్సీ, 15 ఎస్టీ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 .2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును ఎన్నికలలో వినియోగించుకోగా.. మొదటిసారి ఓటును వేస్తున్నవారు 9 .17 లక్షల మంది ఉన్నారు. ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 58282 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. కాగా ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.