తెలంగాణ ఎస్ఎల్బీసీ ప్రమాదం రాజకీయ దుమారం రేపుతోంది. ఘటనకు కారణం మీరంటే మీరే అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు విమర్శలకు దిగుతున్నారు. ప్రమాద ఘటనను నిన్న బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. అనంతరం ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. హరీశ్‌రావు వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే హరీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్..ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎందుకు పెండింగ్ పెట్టిందని జూపల్లి ప్రశ్నించారు. హరీశ్‌రావును తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను 200 మీటర్లు తవ్వి మిగతాది ఎందుకు వదిలేశారన్నారు. తక్కువ లాభం వస్తుందనా, టన్నెల్ నిర్మాణం పూర్తి అయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనా తన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
ప్రకృతి విపత్తులనూ బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఎస్‌ఎల్‌బీసీని ఎందుకు పెండింగ్‌లో పెట్టారన్నారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని విమర్శించారు.
అద్భుతం జరిగితే తప్ప టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది బతికే అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు పనులు చేపట్టిన సంస్థ ప్రతినిధులు అప్రమత్తం చేసి ఉండకపోతే, 40 మంది వరకు కార్మికులు చనిపోయేవారని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని..నిన్న బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. ప్రమాదం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లకుండా ఎన్నికల ప్రచారం చేశారని హరీశ్ రావు ధ్వజమెత్తారు.


