పేరెంట్స్ మీటింగ్ అంటే సహజంగా ఏ ప్రైవేట్ స్కూలో, కార్పొరేట్ స్కూలో అనుకుంటాం. తల్లిదండ్రులకు పిల్లల చదువు, వారి స్థితిగతులను టీచర్స్ వారికి వివరిస్తారు కానీ.. ఇక్కడ ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలు తల్లిదండ్రులు-టీచర్స్ మీటింగ్‌కు హాజరయ్యారు. అది ఎక్కడో కాదండోయ్ మన ఏపీలోనే. పేరెంట్స్‌కు ఎలాంటి సూచనలు చేశారు. దీనిపై తలిదండ్రులు ఏమంటున్నారు.?
ఏపీలో కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్-టీచర్ మీటింగ్ ప్రభుత్వ బడుల‌్లోనూ నిర్వహించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పేరెంట్స్..టీచర్స్ మీట్ కార్యక్రమానికి ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి ప్రోగ్రస్ రిపోర్టులను పరిశీలించారు.
అనంతరం సీఎం చంద్రబాబు తల్లిదండ్రులకు పిల్లల చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సిందిగా సూచించారు. వారి చదువును తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారకుండా జాగ్రత్త పడాలన్నారు. డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు పిల్లలు దూరంగా ఉండాలని తెలిపారు. మానవ సంబంధాలను నాశనం చేసే డ్రగ్స్‌కు సమాజంలో చోటుండకూడదన్నారు.
రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. ఈ ప్రమాదాన్ని కఠినంగా అణచివేస్తామన్నారు. విద్యార్థులు డ్రగ్స్ ప్రమాదాన్ని తెలుసుకుని ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల స్థాయి నుంచే ప్రారంభమవ్వాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలను పాడు చేసుకోవద్దని అన్నారు. ఒకసారి డ్రగ్స్ వ్యసనంలో పడితే తిరిగి మామూలు మనిషి కావడం కష్టమన్నారు సీఎం.
అదే విధంగా ఎలక్ట్రానిక్ డివైసెస్‌తో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారని, వారి చర్యలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. మాయమాటలతో స్నేహం పేరుతో జీవితాలు నాశనం చేసే స్థాయికు వారు వచ్చారన్నారు. టెక్నాలజీతో మంచితో పాటు చెడు ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. 24 గంటల పాటు ఫోన్ చూడటం వ్యసనం..అదొక బలహీనత అని చెప్పారు. టీచర్లు, తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది అన్నారు. రాయలసీమ అంటే వెనకబాటు కాదు.. అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతమని కొనియాడారు.
సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లదని పవన్ కల్యాణ్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఇటీవల విద్యార్థులు తిరగబడి టీచర్‌పై దాడి చేసిన ఘటన చూశామని..ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. ఎక్కడ తప్పు జరిగినా ముందుగానే చర్చించుకోవాలని చెప్పారు. సమస్య పరిష్కారానికి చర్చించుకోవడం చాలా ముఖ్యమని పవన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 45వేల 94 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రభుత్వం పాఠశాలలపై దృష్టి సారించారు. దీంతో రానున్న రోజుల్లో సర్కారీ బడుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.