బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి మహారాష్ట్రలోని థానే జిల్లాలో అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సైఫ్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ని నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు పలు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు.
దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడని పోలీసులు చెప్పారు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతామన్నారు. దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతామని తెలిపారు. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించామని పోలీసులు వివరించారు. నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడని… భారత్ వచ్చాక విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని వెల్లడించారు. ఆరు నెలల క్రితం నిందితుడు ముంబయి వచ్చాడని.. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు.
అతను నాలుగు నెలలుగా ముంబైలో నివసిస్తున్నాడు, హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు, అని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో సైఫ్ ఇంట్లో హౌస్ కీపింగ్ చేశాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని… విజయ్ దాస్ మొదటి సారి సైఫ్ ఇంటికి వెళ్లాడన్నారు డీసీపీ దీక్షిత్.
ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి అగంతకుడు సైఫ్ అలీఖాన్ బంగ్లా వెనుకవైపు ఉన్న ఫైర్ ఎగ్జిట్ ద్వారా ఇంటిలోకి చొరబడ్డాడు. పనిమనిషి అతన్ని గమనించి కేకలు వేసింది. సైఫ్ అతనిని ఎదుర్కొన్నప్పుడు, నిందితుడు నటుడిని ఆరుసార్లు పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్‌ను సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. సర్జరీల అనంతరం సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.